‘విశ్వగురువుగా ఎదుగుతున్న భారత్‌’

రానున్న సమయంలో భారత్‌ విశ్వగురువుగా ఎదుగుతుందని భారత రక్షణమంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్‌ సతీష్‌ రెడ్డి అభిలాషించారు. చాలా తక్కువ కాలంలోనే భారత్‌ ప్రగతి దిశగా పరుగులు తీస్తోందని ఆయన విశ్లేషించారు. హైదరాబాద్‌ బండ్లగూడ జాగీర్‌లోని శ్రీ విద్యారణ్య ఇంటర్‌ నేషనల్‌ స్కూల్‌ (స్విస్‌) నిర్వహించిన ఇన్‌ స్పైర్‌ ఇండియా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్విస్‌ పాఠశాల ప్రగతి గురించి వివరణాత్మకంగా అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రగతి విద్యార్థుల మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతీ విద్యార్థి చక్కని ఆశయాల్ని ఏర్పరచుకొని, వాటి సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సంస్కారాన్ని బట్టి వారి గురువుల్ని గుర్తించగలుగు తామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈనాడు ప్రపంచ దేశాలన్ని మన దేశం వైపే చూస్తున్నా యని, సృజనాత్మకంగా ఆలోచిస్తూ నైపుణ్య భారత దేశాన్నివారు కోరారు.

ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన విద్యా భారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్‌ రెడ్డి గారు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను  అందించేందుకు శ్రీ సరస్వతీ విద్యాపీఠం చేస్తున్న కృషిని వివరించారు. దేశం, సమాజం గురించి ఆలోచించే వారిగా విద్యార్థుల్ని తయారు చేయటంలో శిశుమందిరాల పాత్రను పరిచయం చేశారు. శిశు మందిరములలో చదివిన పూర్వ విద్యార్థులు అంకిత భావముతో అనేక రంగములలో దేశానికి, సమాజానికి సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా భారతి క్షేత్ర కోశాధికారి పసర్తి మల్లయ్య, ప్రిన్సిపాల్‌ గోకులన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *