40 శాతం మేర పెరిగిపోయిన నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు.. ఆందోళనలో పర్యావరణ వేత్తలు
భూమిని వేడెక్కించే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు 1980 నుంచి 2020 మధ్య 40 శాతం పెరిగిపోయాయి. ఇందులో చైనా మొదటి స్థానంలో వుండగా… భారత్, అమెరికా దేశాలు తర్వాతి స్థానాల్లో వున్నాయి. ఈ విషయాన్ని ఎర్త్ సిస్టమ్ సైన్స్ డేటా పేర్కొంది. కార్బన్‌డై యాక్సైడ్, మిథేన్ తర్వాత భూమిని బాగా వేడిక్కించే గ్రీన్‌హౌజ్ వాయువుల్లో నైట్రస్ ఆక్సైడ్ వుంటుంది. ప్రస్తుతం భూమి సరాసరి ఉష్ణోగ్రత 1.15 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది.
ఇందులో మానవుల తప్పులతో వెలువడ్డ నైట్రస్ ఆక్సైడ్ కారణంగా పెరిగిన ఉష్ణోగ్రత వాటా 0.1 డిగ్రీల సెల్సియస్ అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గడచిన దశాబ్ద కాలంలో వాతావరణంలోకి చేరిన ఈ వాయు ఉద్గారాల్లో 74 శాతం నత్రజని ఎరువులు, వ్యవసాయంలో ఉపయోగించే సేంద్రియ ఎరువుల నుంచే వచ్చాయి. 2022లో వాతావరణంలో నైట్రస్ యాక్సైడ్ గాఢత 336 పార్ట్స్ పర్ బిలియన్‌కి పెరిగింది. భూతాపంలో పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువకు పరిమితం చేయాలంటే 2019 నాటితో పోలిస్తే 2050 నాటికి నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు కనీసం 20 శాతం తగ్గాలని నిపుణులు సూచిస్తున్నారు.