సంక్షోభం నేపథ్యంలో లెబనాన్ కి మానవతా సాయం చేసిన భారత్
ఇజ్రాయిల్ హెజ్ బొల్లా మధ్య భీకర దాడుల నేపథ్యంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్ కి భారత్ మానవతా సాయం అందించింది. సంక్షోభ పరిస్థితుల్లో అక్కడి ప్రజలను ఆదుకోవాలన్న సంకల్పంతో వారికి అవసరమైన ఔషధాలను పంపించాలని నిర్ణయించింది. మొత్తం 33 టన్నుల వైద్య సామాగ్రిని పంపుతున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటగా 11 టన్నుల వైద్య సామాగ్రిని ప్రత్యేక విమానంలో పంపించారు.అందులో కార్డియోవాస్కులర్ ఔషధాలు, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ మందులు, యాంటీ బయాటిక్స్, అనస్థీషియా మందులను ఇందులో చేర్చారు. అలాగే గుండె జబ్బులకు సంబంధించిన మందులు కూడా వున్నాయని విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. ఇవి తక్షణ ఆరోగ్య అవసరాలను తీర్చడానికి ఉపకరిస్తుంది. మిగిలిన సామాగ్రి రెండు, మూడు విడతల వారీగా పంపుతామని విదేశాంగ శాఖ పేర్కొంది.