సహజ పద్ధతిలో, కృత్రిమ రంగులు లేకుండా మిఠాయిల తయారీ.. మహిళలకి ఉపాధి లక్ష్యంగా ముందుకు

దేశీ ఆవు పాలు, మన సంప్రదాయ స్వీట్ల తయారీ, ఈ తయారీలో ఎక్కడ కూడా కృత్రిమ రంగులను వాడకుండా స్వచ్ఛమైన, దేశీ ఆవు పాలతో మిఠాయిలను తయారు చేస్తూ… మహిళలకు స్ఫూర్తివంతంగా నిలుస్తున్నారు బెంగళూరుకి చెందిన శ్వేతా రాజశేఖర్‌. పురాతనమైన వంట పద్ధతులను ఇప్పుడు వెలికి తీసి, ఆ సూత్రాల ఆధారంగా ఆరోగ్యకరమైన మిఠాయిలను తయారు చేస్తున్నారు. శ్వేత వాళ్ల కుటుంబం బాగా చదువుకున్న కుటుంబం. ఈమె కూడా ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు కార్పొరేట్‌ రంగంలో పనిచేశారు. అయితే ఆమె ఉద్యోగం చేస్తున్నా… ఎప్పటికైనా వ్యాపార రంగంలోనే స్థిరపడి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నది ఆమె కాంక్ష. అందుకు అనుగుణంగానే ఆలోచనలు చేసేది. ఆమె భర్తది కూడా వ్యాపార రంగమే. దీంతో ఆయన కూడా అండగా నిలబడ్డారు. అయితే.. ఈమెకు సంతానం కలిగిన తర్వాత ఉద్యోగం మానేశారు.

ఈ సమయంలోనే వ్యాపారం వైపు తన అడుగులు పడ్డాయి. మన దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా వుండాలని భావించి, మిఠాయిలను మన ప్రాచీన తయారీ పద్ధతులతో, సహజసిద్ధంగా, ఆరోగ్యకరంగా వుండేలా చేయడం ప్రారంభించింది. దీంతో 2020లో ‘‘ఇండియా స్వీట్‌ హౌజ్‌’’ అన్న పేరుతో మిఠాయిల షాపు ప్రారంభించారు.

సొంతంగా ఓ వ్యవసాయ క్షేత్ర ప్రారంభం…. అందులో 150 గోవులు

అయితే ఈ మిఠాయిల్లో పాలు, వెన్న, నెయ్యి లాంటివి వాడాల్సి వుంటుంది. వీటిని బయటి నుంచి విక్రయిస్తే.. కల్తీగా వుంటాయన్న ఓ బాధ శ్వేతనను నిత్యం వెంటాడేది. దీంతో నీలమంగళం అన్న ప్రాంతంలో ‘‘కర్మ ఫార్మ్స్‌’’ పేరుతో 20 ఎకరాల్లో ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభించారు. ఇందులో వివిధ రకాల మొక్కలు, చెట్లతో పాటు 150 ఆవులను కూడా పెంచుతున్నారు. ఈ క్షేత్రంలోనే వాటికి పోషణ. వీటి ద్వారా చిక్కటి పాలను తీసి, ఈ పాలతోనే వెన్న, నెయ్యి వంటివి తీస్తారు. ఈ స్వచ్ఛమైన వాటినే స్వీట్ల తయారీలో వినియోగిస్తామని తెలిపారు. అయితే… ఈ క్రమంలో ఎక్కడా కృత్రిమపరమైన రంగులు గానీ, ప్రిజర్వేటివ్స్‌ని వాడమని ప్రకటించారు. అంతా సహజసిద్ధమైన, ప్రాచీన పద్ధతులతోనే మిఠాయిలను తయారు చేస్తారు. అంతేకాకుండా చక్కెర కాకుండా మిఠాయిల తయారీకి బెల్లాన్ని వాడతారు. అంజీర్‌ బర్ఫీ, కాజూ బర్ఫీ, కాజూకత్లి, డ్రైఫూట్స్‌ లడ్డూ, కొబ్బరి బర్ఫీ, బెంగాలీ స్వీట్లు తయారు చేస్తున్నారు. అంతేకాకుండా కాలానుగుణంగా దొరికే పండ్లతో కూడా మిఠాయిలను తయారు చేస్తున్నారు.

స్వీట్ల ప్యాకింగ్‌ కూడా సహజ పద్ధతిలోనే….

తన కారణంగా పర్యావరణం పాడుకాకూడదన్న ఉద్దేశంతో మిఠాయిల ప్యాకింగు కూడా సహజసిద్ధంగానే చేస్తామని శ్వేత తెలిపారు. అయితే.. ప్యాకింగ్‌ ఆకర్షణీయంగా వుంటుంది కానీ,.. పర్యావరణను అనుకూల ప్యాకింగ్‌ వుంటుంది. తామిచ్చే బాక్సులు తిరిగి.. వినియోగం అయ్యేలా వుంటాయని తెలిపారు. తమ వ్యాపారం వల్ల పర్యావరణానికి హాని కలగకూడదన్నది తమ సిద్ధాంతం అన్నారు.

మహిళలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో….

తమ వ్యాపారం ద్వారా మహిళలు స్థిరపడాలన్నది సంకల్పంతో తమ వ్యాపారంలో ఎక్కువగా మహిళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ప్రతి వంద మందిలో 35 మంది మహిళలే వుంటారన్నారు. వీరి కేంద్రంగా తమ వ్యాపారం నడుపుతామన్నారు. ఇప్పటికి బెంగళూరు వ్యాప్తంగా 30కి పైగా మిఠాయిలవి తమ బ్రాంచులు వున్నాయన్నారు. అన్ని రంగాల్లో సవాళ్లనేవి అత్యంత సహజమని, తనకు కూడా సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని అధిగమిస్తూనే వ్యాపారం చేస్తున్నామని శ్వేత తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *