నిరుపయోగంగా వున్న వంతెనపై ‘‘కేఫ్’’.. సైన్యం నూత్న ఆవిష్కరణ

అసోంలో భారత సైన్యం ఓ ఉత్తమ ఆవిష్కరణ చేసింది. అరుణాచల్ ప్రదేశ్ లోని న్యామ్ జాంగ్ చూ నదిపై నిరుపయోగంగా బెయిలీ వంతెన వుండిపోయింది. దీనిని భారత సైన్యానికి చెందిన ఓ ఇంజనీర్ ‘‘కేఫ్’’ గా మార్చి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. మారుమూల ప్రాంతంలో వున్న ఈ నిరుపయోగ వంతెనను కేఫ్ గా మార్చడం ద్వారా సామాజిక అభివృద్ధితో పాటు పర్యాటకాన్ని కూడా ప్రోత్సహించినట్లు అవుతుందని, అందుకే ఇలా మార్చేసినట్లు ప్రకటించారు. ఈ కేఫ్ ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజలు, వ్యాపారేవత్తలతో పాటు సైనిక సిబ్బంది హాజరయ్యారు.
దీనికి ‘‘ఆపరేషన్ సద్భావన’’ అని పేరు పెట్టి, ఆ కేఫ్ కి ‘‘బోర్డర్ బ్రూ కేఫ్’’ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టును మోన్పా గిరిజన సమాజం సంక్షేమం, సాధికారత కోసం అంకితం చేశారు.న్యామ్‌జాంగ్ చూ నదిపై నిరుపయోగంగా ఉన్న బెయిలీ వంతెనపై దీని వినూత్నమైన నిర్మాణం, బోర్డర్ బ్రూ కేఫ్‌ను నిజంగా ప్రత్యేకంగా నిలుపుతుంది. ఆధునిక సౌకర్యాలను మేళవించి, మొత్తం ఈశాన్య ప్రాంతంలోనే దీనిని ప్రత్యేక ఆవిష్కరణగా చేశారు.
సరిహద్దులో వున్న ప్రాంతాన్ని పర్యాటక రంగం విషయంలో విశేషంగా ఆకర్షించేలా తయారు చేశారు. అలాగే ఇలా కేఫ్ ను తయారు చేయడం ద్వారా స్థానికులకు స్థిరమైన ఉపాధి కూడా లభిస్తుంది. పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు, ప్రజలకు కూడా ఉపయోగకరం. స్ధానిక సంస్కృతి, సంప్రదాయాలు, ఆతిథ్యాన్ని ప్రదర్శించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
కేవలం 31 రోజుల్లోనే పూర్తి చేసిన సైన్యం….
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టును భారత సైన్యం కేవలం 31 రోజుల్లోనే పూర్తి చేసింది. పూర్తి నిబద్ధత, అంకిత భావంతో చేశారు. పక్కా ప్రణాళిక, సమన్వయంతోనే ఇది సాధ్యమైందని అంటున్నారు.
ఈ చొరవతో సద్భావన పెరగడంతో పాటు పౌరుల మధ్య సైనికుల మధ్య ఓ సుహృద్భావ వాతావరణం కూడా పెరుగుతుంది. అలాగే సరిహద్దు ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కూడా సహకారం అవుతుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొనే ఈ కేఫ్ ను తయారు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *