మృత కాదు… మనది అమృత ఆర్థిక వ్యవస్థ
ఏటికేడు ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థను చూసి ఓర్వలేక ‘మృత ఆర్థిక వ్యవస్థ’ అంటూ అక్కసు వెళ్ళగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈయన వ్యాఖ్యలు నిజమేనంటూ ‘తానతందాన’ అని వంత పాడారు ప్రతిపక్షనేతలు. స్వదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా భారతదేశాన్ని, భారత ప్రభుత్వాన్ని తక్కువ చేస్తూ, చులకన చేస్తూ వ్యాఖ్యలు చెయ్యడం వాళ్ళకి అలవాటే. ఇక ఒక విధాన మంటూ లేక క్షణానికొక నిర్ణయం తీసుకుని అమెరికా కోర్టుల నుంచి సైతం వ్యతిరేకతను ఎదుర్కుంటూ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే అనవసరమైన తలనొప్పి తెచ్చుకున్నామని అమెరికన్లతో అనిపించు కుంటున్న ఘనత ట్రంప్‌ది. అదనపు పన్నుల పేరుతో బెదిరించి, భయపెట్టి ఇతర దేశాలను లొంగదీసుకోవాలనే తాపత్రయం ఈయనకు ఎక్కువే.
తాజాగా తనకు ఇష్టంలేని రష్యా నుంచి చమురు కొంటున్నారంటూ భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, ఎలాగైనా అంతర్జాతీయంగా మన ప్రతిష్టను, వాణిజ్యావకాశాలను దెబ్బ తీయడానికి భారత్, రష్యాలవి మృత ఆర్థిక వ్యవస్థ లంటూ వ్యాఖ్యానించారు. భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలను కూడా విధించారు. ఇది చాలదన్నట్టు పాకిస్తాన్‌ని పైకెత్తేస్తూ ఆ దేశంతో చమురు ఒప్పందం కుదిరిందని, ముందు ముందు భారత్ సైతం పాక్ నుంచి చమురు కొనే రోజులు వస్తాయని ట్రంప్ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలు విని రాజకీయ విశ్లేషకులు, ఆర్ధిక వేత్తలు నవ్వు కుంటున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాలుబీ భారత్-పాక్ పరిణామాలను పూర్తిగా అమెరికాకు ఆర్ధికంగా ప్రయోజనాలు చేకూర్చేలా మార్చుకోవడానికి ట్రంప్ పడుతున్న పాట్లు ముందుగా అమెరికా ఆర్ధికవ్యవస్థనే అగచాట్ల పాలు చేస్తాయనే సత్యాన్ని ఆయన గమనించడం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగ మార్కెట్‌లలో ఒకటిగా ఉన్న భారత్‌పై ట్రంప్ విధించే సుంకాలు అమెరికాలో సైతం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయని బల్లగుద్ది చెబుతున్నారు.
ఇక భారత ఆర్థికవ్యవస్తపై ట్రంప్ వ్యాఖ్యలనే గమనిస్తే… పలు అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చెయ్యడానికి రంగం సిద్దం చేసుకున్నాయి. భారత ఆర్థికాభివృద్ధిపై ఐఎంఎఫ్ తన అంచనాలను వెల్లడిస్తూ 2025, 2026 ఆర్థిక సంవత్సరాలలో 6.4 చొప్పున జీడీపీ వృద్ధి నమోదవుతుందని తెలిపింది. పారిస్ నుంచి కార్యకలాపాలు నిర్వ హించే మరో ఆర్ధిక సంస్థ ఓఈసీడీ (Organization for Economic Co-operation and Development) సంస్థ సైతం భారత ఆర్థికాభివృద్ధి విషయంలో మెరుగైన అంచనాలే ప్రకటించింది. ఈ సంవత్సరంలో భారతదేశం 6.3 శాతం వృద్ధిని సాధిస్తుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. మరోవైపు ఆసియా అభివృద్ధి బ్యాంక్ 6.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అదే సమయంలో లండన్ కేంద్రంగా పనిచేసే అతి పెద్ద అకౌంటింగ్ సంస్థ అయిన ఈవై నెట్‌వర్క్‌లోని ఈవై ఇండియా సంస్థ స్పందిస్తూ 28.8 సంవత్సరాల సగటు వయసుతో పెద్ద ఎత్తున యువజనాభా ఉన్న భారతదేశానిది చురుకైన ఆర్థిక వ్యవస్థ అంటూ ట్రంప్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చింది. రష్యా నుంచి ఏమీ కొనవద్దని చెబుతున్న అమెరికా, ఆ దేశం (రష్యా)తో వ్యాపార సంబంధాలను కొనసాగిస్తూనే ఉందని చైనా ఘాటుగా విమర్శించింది. దీనికి అమెరికా దగ్గర జవాబు లేదు. ట్రంప్ విధించిన సుంకాలు, చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీటి ప్రభావంపై భారత్ ఇప్పటికే దృష్టి సారించి తగు చర్యలకు ఉపక్ర మించింది.
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తాజా పరిణామాలను మనం గమనించాలి. మన దేశం జపాన్‌ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని నీతి అయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ‘‘ప్రస్తుతం మనది నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువైన నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ’’ అన్నారు. ఐఎమ్‌ఎఫ్ డేటా ప్రకారం, భారత ఆర్థిక వ్యవస్థ జపాన్ కంటే పెద్దదని చెప్పారు. ప్రస్తుతం భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ దేశాలు ఉన్నాయన్నారు. ప్రస్తుత ప్రణాళిక లకు మనం కట్టుబడి ముందుకు సాగితే వచ్చే 2.5-3 సంవత్సరాల్లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికాకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో చైనాను భారత్ అధిగమించిందని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కెనాలిస్ వెల్లడిరచింది. అమెరికాకు భారత్ నుంచి జరుగుతున్న స్మార్ట్ ఫోన్ల ఎగుమతిలో 240 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఇదిలా ఉంటే, భారత్-చైనా విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయి అక్కడి వర్శిటీలు ఆర్ధికంగా కుదేలయ్యాయని, ఈ పరిణామంతో అమెరికాలో ప్రస్తుతం సేవారంగం, STEM (సైన్స్, టెక్నాలజి, ఇంజనీరింగ్, మేథ్స్) పరిశోధనా రంగాల పరిస్థితి ఘోరంగా ఉందని తాజా పరిణామాలు వెల్లడిస్తు న్నాయి. ట్రంప్ గారి MAGA (Make America Great Again) ఎటుపోతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.