భారతీయతే మన జాతీయత

భారతదేశం నా మాతృభూమి అంటూ సాగే ప్రతిజ్ఞ మనందరికీ తెలిసిందే… మనం అమ్మను ఎలా చూసుకుంటాం? ఎలా చూసుకోవాలి? నవ మాసాలు మోసి ప్రాణాలకు తెగించి జన్మనిచ్చి, పాలిచ్చి అన్నం పెట్టి మనం పెద్దవాళ్లమై, ఎవరి కాళ్ల మీద వారు నిలబడే వరకు కంటి చూపుతోనే కాపాడే అమ్మ త్యాగాలను వర్ణించం ఎవ్వరికీ సాద్యం కాదు.. ఎంత మంది వర్ణించినప్పటికీ ఆ త్యాగానికి అది తక్కువే… అమ్మ త్యాగాలను కొలిచే సాధనాలు, ఈ భూమి మీద లేవు. ఇక ముందు కూడా రావు. అదే అమ్మ గొప్పతనం. అందుకే అమ్మను ఎలా చూసు కుంటామో ఆమె ఋణం ఎలా తీరుతుందో ఎవరికి వారే ఆలోచించుకొని అలా చూసుకున్నప్పుడు మనిషి జన్మకు సార్థకత కలుగుతుంది అమ్మ ప్రేమను వర్ణించడం ఎంత కష్టసాధ్యమో… అలాగే భారతమాత మహిమను వర్ణించటం కూడా ఎవరికీ సాధ్యం కాదు.. ఇక భూమి అనే శబ్దం ద్వారా ఏమి నేర్చుకోవచ్చో తెలుసు కుందాం. భూమి మనిషికి మొదటి గురువు అనే చెప్పవచ్చు, మనం కూడా అంటాం కదా.. భూమాతకు ఉన్నంతసహనం ఉండాలని, పంటలు పండిరచడానికి తనను త్రవ్వినా, గుచ్చినా, హింసించినా తనపై ఎంతో భారాలు, బరువులు పడవేసినా ఆ తల్లి కోపించదు. భూమిపై ఉన్న నదులు, పర్వతాలు కూడా మన మంచినే కోరుతాయి. అనేక రకాలైన ఖనిజ సంపద అందిస్తుంది. ఆ నేల తల్లి మనం పెట్టే ఇబ్బందులను భరించటమే కాకుండా పంటలు పండిరచి ఇచ్చి మనుషులు బ్రతకడానికి సహాయ పడుతుంది భూమి. ఆ విధంగా భూమి అనే శబ్దం పలికినపుడు, విన్నప్పుడు వెంటనే గుర్తుకు వచ్చేది ఆ తల్లి సహనం, క్షమాగుణం. అయితే ‘భారతదేశం నా మాతృ భూమి’ ఈ వాక్యంలో మనం తెలసుకోవలసిన ఇంకొక విశేషం వుంది. భారతదేశంలో ‘భా’ అనే అక్షరానికి అర్థం ప్రకాశము, ప్రకాశమంటే వెలుతురు. వెలుతురు జ్ఞానానికి సంకేతం. ఈ భావంతో భారతదేశాన్ని చూసినట్లయితే ఏ ప్రదేశమైతే నిరంతరం జ్ఞానంతో నిండి ఉంటుందో ఆ ప్రదేశమే భారతదేశం అణువణువునా జ్ఞాన తరంగాలు ప్రవహిస్తుండే పవిత్ర ప్రదేశం మన దేశం ఇంతకీ ఏంటా జ్ఞానం అనే సందేహం మనందరికీ కలుగుతుంది. జ్ఞానమంటే ప్రత్యక్షంగా తెలుసుకోదగినది. ఎక్కడైతే మనిషి పరిపూర్ణమైన మానవుడిగా ఎదుగుతాడో ఆ జ్ఞానముతో నిండిన ప్రదేశం మన మాతృదేశం. అందుకే పుట్టుకతోనే వెలుగులో జీవించే అవకాశం, అదృష్టం మన భారతీయులకు దొరికింది. అది అంతా మన మట్టిమహిమే. అయితే భారతదేశంలో పుట్టడము కేవలం మన అదృష్టం అనుకోవచ్చు లేదా అదృష్టవంతులకు మాత్రమే ఇక్కడ పుట్టే అవకాశం దొరుకుతుందని అనుకోవచ్చు. అందుకే చూడటానికి చిన్నగా ఉన్నా ఎంతో లోతున్న ‘భారతదేశం నా మాతృభూమి’ అనే ప్రతిజ్ఞలోని మొదటి వాక్యంలో ఇంతలోతైన అర్థం దాగి ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *