మన భాషలన్నీ భారతీయ భాషలే..
భారత్‌లో విచ్ఛిన్నకర శక్తులు పాతపడిపోయిన వదంతులను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై ఏకైక జాతీయ భాషగా హిందీని రుద్దాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరఎసఎస్) చూస్తున్నదనే దుష్ప్రచారానికి ఆ శక్తులు దిగాయి. కానీ మొదటి నుంచి కూడా దేశంలో అన్ని భాషలూ జాతీయ భాషలేనని ఆరఎసఎస్ చెబుతూ వస్తున్నది. ‘భాష సమస్య’ పై ఆరఎసఎస్ ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్ శ్రీ గురూజీ గోల్వాల్కర్ తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలిపారు. వారి అభిప్రాయాలతో కూడిన రెండు ఇంటర్వ్యూలు ‘ఆర్గనైజర’ పత్రికలో 1957 డిసెంబర్, 1967 అక్టోబర్‌లో ప్రచురితమయ్యాయి. ప్రశ్న, జవాబు రూపంలో ప్రచురితమైన ఇంటర్వ్యూల తెలుగు అనువాదం దిగువన ఇస్తున్నాము.
ప్రశ్న: దేశ భాషల్లో ఏది మన జాతీయ భాష అవుతుంది?
జవాబు: మన భాషలన్నింటిని జాతీయ భాషలుగా నేను పరిగణిస్తాను. అవి సరిసమానమైన స్థాయి కలిగిన మన జాతీయ వారసత్వ సంపద. వాటిలో హిందీ ఒకటి. దేశవ్యాప్తంగా విని యోగంలో ఉన్న భాష కావడంతో హిందీని రాష్ట్ర భాషగా స్వీకరించడానికి సంకల్పించారు. హిందీని మాత్రమే జాతీయ భాషగా ఇతర భాషలను ప్రాంతీయ భాషలుగా పేర్కొనడం సరికాదు. అది సహేతుకమైన దృక్కోణం కాదు.
ప్ర: కొద్ది కాలం క్రితం, డాక్టర్ సి.రామస్వామి అయ్యర్ హిందీ భాషను బహిరంగంగా అపహాస్యం చేశారు. తులసీ రామాయణం, రైల్వే టైమ్ టేబుల్‌ను హిందీలో ప్రచురితమైన రెండు గొప్ప పుస్తకాలుగా ఆయన వ్యాఖ్యానించారు. డాక్టర్ సి.పి.రామస్వామి అయ్యర్ వ్యాఖ్యలకు సర్దార్ పణిక్కర్ వంత పాడారు.
జ: హిందీ భాషను నిర్లక్ష్యం చేసే వారు మాత్రమే ఆ భాషను అపహాస్యం చేస్తారు. ఇతర భాషలను వెక్కిరించే ఈ ధోరణికి స్వస్తి చెప్పాలి. కొద్ది కాలం క్రితం, ప్రముఖ మరాఠా నాటకకర్త రామ్ గణేష్ గడ్కరీ తాను రూపొందించిన ఒకానొక పాత్రతో “దక్షిణాది భాషలు, కొన్ని రాళ్ళను ఒక డబ్బాలో వేసి ఆడిస్తే, ఆ భాషలను మీరు వినవచ్చు” అని చెప్పించారు. హాస్యం పుట్టించడానికి మాత్రమే అలా చెప్పించారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అలాంటి విచ్ఛినకరమైన వినోదం దేశానికి ఏ మాత్రం మంచిది కాదు.
ప్ర: హిందీ ఎదుగుదల తమ మాతృభాషలను గ్రహణంలా కమ్మేస్తుందని కొందరు భావిస్తున్నారు
జ: అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఉదాహరణకు, ఆంగ్ల భాష ఆధిపత్యంలోనూ బెంగాలీ, తమిళం, మరాఠీ, తెలుగు భాషలు వర్థిల్లాయి. హిందీ భాష ఎదుగుదలతో ఈ భాషలు మరింతగా వర్థిల్లుతాయి. అదే సమయంలో హిందీ మరింతగా విరాజిల్లుతుంది. బెంగాలీ భాష హిందీయీకరణ గురించి బెంగాలీలు భయపడటం ఎందుకు? గడిచిన 20 సంవత్సరాలుగా బెంగాలీ భాష ఉర్దూయికరణకు గురైంది. ‘ఉదయం’ పదానికి గాను బెంగాలీలో ‘ప్రభాతే’ పదాన్ని వినియో గించేవారు. కానీ ప్రస్తుతం ‘ప్రభాతే’ స్థానాన్ని ‘ఫజరే’ అనే ఉర్దూ పదం ఆక్రమించుకుంటున్నది. కానీ దీనిపై ఇంతవరకు బెంగాలీల నుంచి ఒక్క నిరసన గళం కూడా వినిపించలేదు. అలాంటప్పుడు హిందీ భాష అంటే వారికి ఎందుకు అంత ఏహ్యభావం?
తమిళ భాషను హిందీ దెబ్బ తీస్తుందని కొద్ది కాలం క్రితం మదురైలో ఒక అడ్వకేట్ నాతో అన్నారు. అదెలా అని నేను అతడిని అడిగాను కానీ అతడు వివరించలేకపోయాడు. జిల్లా కోర్టులో అనుమతించినప్పటికీ తమిళ భాషకు బదులుగా ఆంగ్ల భాషను ఎందుకు వినియోగిస్తున్నారని నేను అతడిని ప్రశ్నించాను. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అప్పుడు నేను అతడితో తమిళానికి శత్రువు హిందీ కాదు. ఇరు భాషలకు శత్రువు ఆంగ్ల భాష అని అన్నాను.
ప్ర: నాలుగు భాషలు – మాతృభాష, హిందీ, సంస్కృతం, ఆంగ్లము మరీ ఎక్కువ అని మీరు భావించడంలేదా? అవి ఒక విద్యార్థి విలువైన సమయంలో సగ భాగాన్ని వినియోగించుకుంటాయి.
జ: కావచ్చు కానీ ఆ నాలుగు భాషల్లోనూ అత్యధికంగా ఉపేక్షించవలసిన భాష ఆంగ్లము. అది తప్పనసరి భాషగా ఉండరాదు. ప్రభుత్వం ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకొని, ఆ నిర్ణయానికి కట్టుబడి, తక్షణం అమలు చేసిన పక్షంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి తెరపడుతుంది. ప్రస్తుత నిర్ణయరాహిత్యం ఆంగ్ల భాషను మరింత బలోపేతం చేస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు బాలబాలికల్లో అత్యధికులు కాన్వెంట్‌లకు వెళుతున్నారు. మరికొందరైతే ఒక అడుగు ముందుకు వేసి “ఆంగ్లభాషను భారత్ వ్యవహార భాషగా చేయాలి” అని బహిరంగంగా విజ్ఞప్తి చేయటం ప్రారంభించారు. ఈ కీలకమైన రాష్ట్ర వ్యవహారంలో ప్రభుత్వం ఒక ఊగిసలాట వైఖరిని చేపట్టిన పక్షంలో అది ప్రజా విశ్వాసాన్ని భూస్థాపితం చేస్తుంది.
పూర్వ మధ్యప్రదేశ్‌లో విద్యా శాఖ తన కార్యకలాపాలను హిందీ, మరాఠీ భాషల్లో కొనసాగిస్తున్నది. కానీ అతి పెద్ద బాంబే ఆవిర్భవించిన తర్వాత పూర్వ మధ్యప్రదేశ్‌లో మరాఠీ ప్రాంతాలు తిరిగి ఆంగ్ల భాష వైపునకు మొగ్గు చూపాయి. పూర్తి మార్పు కోసం రాజ్యాంగం నిర్దేశించిన కాల పరిమితికి లోబడి 1965 నాటికి రాష్ట్ర భాషగా ఆంగ్లభాష స్థానాన్ని భర్తీ చేయడమే ఏకైక మార్గం. ప్రకటిత విధానానికి, దానిని అమలు చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఏకరీతిన ఉండాలి.
ప్ర: రాష్ట్ర భాషగా హిందీని ఆపాదించిన పక్షంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడతారని రాజాజీ అంటున్నారు
జ: అలాంటిదేమీ ఉండదు. వారు భాషలను చాలా త్వరగా స్వీకరిస్తారు. దక్షిణ భారతీయులు కాశీ లేదా ప్రయాగ వచ్చినప్పుడు ఏ భాషలో మాట్లాడుతారు? అది హిందీ భాష లాంటిదే కదా?
ప్ర: ఆంగ్ల భాష అందరికీ సరిసమానమైన విదేశీ భాష కనుక రాష్ట్ర భాషగా దాని కొనసాగింపు న్యాయమైనది మరియు సముచితముగా ఉంటుందని రాజాజీ అంటున్నారు.
జ: అందరికీ సరిసమానమైన విదేశీ భాషను అంతే సరిసమానంగా దానిని అందరూ త్యజించాలి. అది అందరికీ సరిసమానంగా అన్యాయమైనది, అసంబంద్ధమైనది. తమిళ భాషను ఒక రాష్ట్ర భాషగా ఆపాదించాలని ఈ నేతలు వాదించిన పక్షంలో దానికి ఒక అర్థం ఉంటుంది. అది అత్యంత ఘనమైనది, అత్యంత పురాతనమైనది అని వారు చెప్పవచ్చు. దానికి కొంత ఔచిత్యం ఉండాలి. కానీ ఆంగ్ల భాష నైరాశ్యంతో కూడుకున్న ఒక ఆలోచన.