భారత్ ఆయుధాలకు ప్రపంచంలో భారీ డిమాండ్
భారత్ దేశీయంగా తయారు చేసిన ఆయుధాలకు ప్రపంచ విపణిలో డిమాండ్ భారీగా పెరిగింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఎక్కువగా దేశీయ ఆయుధాలనే వాడి, పాక్‌కి ముచ్చెమటలు పట్టించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు డీఆర్డీవో తయారు చేసిన డీ4 యాంటీ డ్రోన్ సిస్టమ్ విజయవంతమైంది. దీనికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ వచ్చింది. డీ4 యాంటీ డ్రోన్ డ్రోన్ సిస్టమ్ ను డీఆర్డీవో అభివృద్ధి చేయగా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (దీజుూ) తయారు చేసింది. స్వదేశీ రక్షణ సాంకేతికతతో తయారైన డీ4 యాంటీ డ్రోన్ సిస్టమ్ తమకు కావాలని ఇప్పటికే తైవాన్ అధికారికంగా భారత్‌ను అడిగింది. ఈ మేరకు సంప్రదింపులు కూడా జరిగాయి. ఈ విషయాన్ని డీఆర్డీవోకి సంబంధించిన ఓ అధికారి ధ్రువీకరించారు.
తైవాన్ సరిహద్దుల దగ్గర ఈ మధ్య తరుచుగా చైనాకి సంబంధించిన డ్రోన్ చొరబాట్లు పెరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని నిరోధించడానికి తైవాన్ భారత్‌ని సంప్రదించింది.
చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవు తున్నాయి. ఈ తరుణంలో కిన్మెన్, మాట్స్ దీవుల వంటి సున్నిత ప్రాంతాల చుట్టూ ఉద్రిక్తతలు పెరుగు తున్నాయి. తైవాన్ ఈ దృష్ట్యానే భారత్‌ను సంప్రదిం చింది. గత కొన్ని సంవత్సరాలుగా, తైవాన్ తన గగనతలంలో చైనా డ్రోన్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని పేర్కొంటోంది. వీటిని ఎదుర్కోవాలంటే తైవాన్‌కి పెద్ద మొత్తంలో ఖర్చవు తుంది. అయినా సరే.. యాంటీ డ్రోన్ పరిష్కారాల కోసం వెతుకుతోంది. ఈ నేపథ్యంలోనే డీ4 యాంటీ డ్రోన్ వ్యవస్థ తైవాన్ దృష్టిని ఆకర్షించింది.
యాంటీ డ్రోన్ వ్యవస్థ డీ4 అంటే
పశ్చిమ సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ తరచూ ప్రయోగిస్తున్న డ్రోన్ల చొరబాట్లకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ‘డ్రోన్-డిటెక్ట్, డెటర్ అండ్ డిస్ట్రాయ్’ (డీ4) వ్యవస్థ సమర్థ వంతంగా అడ్డుకట్ట వేసింది. ఇజ్రాయెల్ తన సరిహద్దుల్లో హమాస్, హౌతీల రాకెట్ దాడులను నిరోధించడానికి వినియోగిస్తున్న ప్రఖ్యాత ‘ఐరన్ డోమ్’ వ్యవస్థకు ఇది దీటుగా నిలుస్తోంది. ఈ అదృశ్య కవచం, పాకిస్థాన్ వినియోగిస్తున్న టర్కిష్ డ్రోన్లతో సహా అనేక వైమానిక చొరబాట్లను విజయవంతంగా నిర్వీర్యం చేసింది. డీ4 యాంటీ డ్రోన్ వ్యవస్థ ద్వారా దేశంలోని కీలక రక్షణ కేంద్రాలను రక్షించుకోవచ్చు.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన దాడుల్లో డ్రోన్లను భారీగా వాడారు. డ్రోన్ల దాడిని తిప్పికొట్టేందుకు గగనతల రక్షణ వ్యవస్థనూ బాగా ఉపయోగించారు. పాకిస్థాన్ నుంచి డ్రోన్లను భారత ఎస్-400, ఆకాశ్ వంటి క్షిపణులు, భారత్ ఎలక్ట్రోనిక్స్ లిమిటెడ్ తయారు చేసిన డీ4 (డ్రోన్ డిటెక్షన్, డెటర్ అండ్ డెస్ట్రాయ్) సిస్టమ్స్ ప్రధాన పాత్ర పోషించాయి.
డీ4లో రాడార్లు, లేజర్లు, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ ప్రధానమైనవి. డీఆర్‌డీవో వీటిని అభివృద్ధి చేసింది. ఆ తర్వాత వీటిని దేశం కోసం భారీ సంఖ్యలో తయారు చేసింది మాత్రం బీఈఎల్. డీ4 సిస్టమ్స్‌కు రాడార్లను బెంగళూరు యూనిట్‌లో తయారు చేశారు. అలాగే, జామర్లను హైదరాబాద్ లోని యూనిట్ ఉత్పత్తి చేసింది.
ఈ దశ తర్వాత వీటిని ఏపీలోని మచిలీపట్నా నికి పంపుతారు. అక్కడి యూనిట్ ఎలక్ట్రో ఆప్టిక్ ఉపకరణాలను తయారు చేసి, రాడార్లు, జామర్లను అనుసంధానిస్తుంది. దీంతో డీ4 సిస్టమ్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. శత్రుదేశం నుంచి దూసుకొచ్చే డ్రోన్లను మన రాడార్లు చాలా దూరం ఉండగానే గుర్తిస్తాయి.ఆ డ్రోన్లు మరింత ముందుకు వచ్చాక కెమెరాలు, లేజర్ రేంజ్ ఫైండర్ వంటి ఎలక్ట్రో ఆప్టిక్ పరికరాలు ఆ డ్రోన్లను మరింత క్లియర్‌గా గుర్తించి మన సైనికులను అప్రమత్తం చేస్తాయి. దీంతో శత్రు డ్రోన్లను జీపీఎస్ జామింగ్ లేదా లేజర్ ఎక్స్‌పరిమెంట్ ద్వారా కూల్చుతారు.
సాధారణంగా డ్రోన్లను శత్రువుల గగనతలం వైపు పంపేటప్పుడు జీపీఎస్ ద్వారా ప్రోగ్రామ్ చేస్తారు. ఇండియాలో స్థావరాలు ఎక్కడ ఉన్నా యన్న శాటిలైట్ డేటాను డ్రోన్లలో పొందుపరుస్తారు. అనంతరం గూగుల్ మ్యాప్ సాయంతో ఆ డ్రోన్లు లక్ష్యాల వద్దకు చేరుకుని దాడి చేస్తాయి. డ్రోన్లలోని జీపీఎస్ సిగ్నల్‌ను జామ్ చేస్తే డ్రోన్లకు ఎటు వైపు వెళ్లాలో తెలియక తికమకపడి కూలిపోతాయి. లేకపోతే భారత్ ఆ డ్రోన్లపైకి లేజర్‌ను పంపి ధ్వంసం చేస్తుంది. పాకిస్థాన్ నుంచి వచ్చిన డ్రోన్లను కూల్చడంలో డీ4 సిస్టమ్స్ బాగా పనిచేశాయి.‘‘మేకిన్ ఇండియా’’ సత్తా ఇదీ…
35 రెట్లు పెరిగిన దేశ రక్షణ ఎగుమతులు
భారత్ తయారు చేసే వాటిని కొనుగోలు చేసుకోవడానికి ప్రపంచ దేశాలు కొన్ని ముందుకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా గత 11 సంవత్సరా లలో దేశ రక్షణ ఎగుమతులు 35 రేట్లు పెరిగాయి. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. అలాగే రాబోయే కొద్ది రోజులలోనే రక్షణ రంగంలో పూర్తిగా స్వావలంబన కూడా సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
2014తో పోలిస్తే నేడు భారత దేశ రక్షణ ఎగుమతులు 35 శాతం మేర పెరిగాయని తెలిపారు. 2013,4 లో రక్షణ ఎగుమతులు కేవలం 686 కోట్లుగా వుండగా, ఇప్పుడు 2024-2025 నాటికి 23,662 కోట్లకు పెరిగాయని రక్షణ మంత్రి ప్రకటించారు. మన దేశంలో తయారయ్యే రక్షణ ఉత్పత్తులు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ సంవత్సరం రక్షణ ఎగుమతులలో 30,000 కోట్లు అని, వచ్చే 2029 సంవత్సరం నాటికి 50,000 కోట్లు సాధించడమే తమ లక్ష్యమని కూడా వెల్లడిరచారు.
ఈ లక్ష్యాలను చేరుకోవడం ద్వారా ఆత్మ నిర్భర్ దిశగా భారత్ అడుగులు వేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఓ దేశం తన సొంత రక్షణ పరికరాలను, సొంత ఆయుధాలను, యుద్ధ విమానాలను, క్షిపణులను తయారు చేయడం ప్రారంభించినప్పుడు, విశ్వాసం పెరుగుతుందని, ప్రపంచ దేశాలకు ఓ బలమైన సందేశాన్ని కూడా పంపినట్లవుతుందని వివరించారు. దీని ద్వారా రక్షణ రంగంలో స్వావలంబన కలుగుతుందని, సమర్థవంతులం అవుతామని, ఇతరులపై ఆధారపడటం కూడా తగ్గిపోతుందన్నారు.
ఈ సందర్భంగా శత్రువులను ఎదుర్కొనే విషయంలో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు, రక్షణ సాంకేతికతలను ఉపయోగిస్తున్నామని, వీటి ప్రాముఖ్యత కూడా పెరిగిందని నొక్కి చెప్పారు. నేడు మన సాయుధ దళాలు దిగుమతి చేసుకున్న ఆయుధాలే కాకుండా, దేశీయంగా అభివృద్ధి చేసిన క్షిపణులు, ట్యాంకులతో పాటు ఇతర ఆయుధ సామాగ్రితో కూడా శత్రువులపై విరుచుకుపడడానికి సన్నద్ధమయ్యాయని అన్నారు. అలాగే భారత్ లోనే తయారైన అగ్ని, పృథ్వీ, బ్రహ్మోస్ వంటి క్షిపణులు ఏవిపత్తునైనా ఎదుర్కోడానికి ఎలాగూ సంసిద్ధంగానే వున్నాయని ధీమా వ్యక్తం చేశారు.
మన దేశం ఇప్పుడు ఐఎన్‌ఎస్ విక్రాంత్ లాంటి విమాన వాహక నౌకలను నిర్మించగల సామర్థ్యాన్ని కూడా కలిగి వుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో దేశీయ రక్షణ ఉత్పత్తిలో వృద్ధి కూడా కలిగిందని అన్నారు. దేశీయ కంపెనీలను ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ గణనీయమైన ఫలితాలే ఇచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే 2014 లో దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 40 వేల కోట్లు వుండగా, నేడు అది 1.3 లక్షల కోట్ల రికార్డును దాటి పోయిందని, క్రమంగా పెరుగుతూనే వుందని మంత్రి తెలిపారు.
ఈ సంవత్సరం రక్షణ ఉత్పత్తిలో 1.6 లక్షల కోట్లను అధిగమించడమే తమ లక్ష్యమని రాజ్‌నాథ్ ప్రకటించారు. 2029 నాటికి 3 లక్షల కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాజ్‌నాథ్ ప్రకటించారు.