స్వదేశీ మిసైళ్లతోనే పాక్‌కి చుక్కలు
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి అందరికీ తెలిసిందే… పాకిస్తాన్ చేసిన అన్నిరకాల దాడులను మనసైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ ఆపరేషన్‌లో భారత్ దేశీయంగా తయారుచేసిన అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. అర్ధరాత్రి మెరుపుదాడిలో తొమ్మిదికి పైగా స్థావరాలను నేలమట్టంచేసింది.
త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కోసం తమ అమ్ములపొదిలో ఉన్న అత్యాధినుక ఆయుధాలను బయటకు తీశాయి. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్లు సమాచారం.
నిజానికి ఇలాంటి మిలిటరీ ఆపరేషన్లకు ఏ రకం ఆయుధాలు వాడారన్నది దళాలు ఎప్పడూ కూడా బహిర్గతం చేయవు. కానీ, అవి లక్ష్యాలను ఛేదించిన తీరు ఆధారంగా నిపుణులు ఓ అంచనాకు వస్తుంటారు. త్రివిధ దళాలు ఆత్మాహుతి డ్రోన్లను విస్తృతంగా వినియోగించినట్లు తెలుస్తోంది. అవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని విరుచుకుపడతాయి. లక్ష్యాలను కచ్చితంగా గుర్తిస్తాయి. వాటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. అలాంటి డ్రోన్స్ భారత్ దగ్గర చాలానే ఉన్నాయి. స్కాల్ప్ క్షిపణులను స్ట్రామ్ షాడో అని కూడా పిలుస్తుంటారు. ఈ యాంటీడ్రోన్ సిస్టమ్ సొంత టెక్నాలజీతో రూపొందించిందే… పాక్ వందల కొద్దీ డ్రోన్‌లను ప్రయోగించినపుడు ఈ వ్యవస్థ అడ్డుకుంది.
అంతేకాదు ఆత్మనిర్భర భారత్ లో భాగంగా మనం ఆకాశ్, బ్రహ్మోస్, డ్రోన్స్, యాంటీ రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలు సొంతంగా తయారుచేసుకుని వాటితో శత్రువుని దెబ్బతీశాం. ఆకాశ్ విజయవంతంగా శత్రుస్థావరాలను చిత్తుచిత్తు చేసింది. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ ప్రాజెక్టును మాజీ రాష్ట్రపతి, డీఆర్‌డీవో డైరెక్టర్‌గా పనిచేసిన దివంగత అబ్దుల్‌కలాం చేపట్టారు. సొంత టెక్నాలజీ ఉపయోగించి పృథ్వి, అగ్ని, ఆకాశ్, త్రిశూల్, నాగ్ మొదలైన భూతల, గగనతల మిసైళ్లను తయారు చేశాము.
అంతేకాదు ఈ ఆపరేషన్‌లో భారతదేశ ఉప గ్రహలు కూడా కీలక పాత్ర పోషించాయి. మే 11న, ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ మాట్లాడుతూ, వ్యూహాత్మక కార్యకలాపాలు. జాతీయ భద్రతకు మద్దతుగా కనీసం పది ఉపగ్రహాలను 24 గంటలూ మోహరించామని పేర్కొన్నారు. ఈ ఉపగ్రహ వ్యవస్థ 7,000 కి.మీ తీరప్రాంతంతో పాటుగా ఉత్తర సరిహద్దులను నిరంతరం పర్యవేక్షించడానికి సహాయపడిరది. ఇక ఈ ఆపరేషన్ సిందూర్ విజయంలో మన డ్రోన్ వ్యవస్థ గురించి తప్పక చెప్పుకోవాల్సిందే..550కి పైగా కంపెనీలు, 5,500 మంది డ్రోన్ పైలట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DFI), డ్రోన్ కౌంటర్-డ్రోన్ టెక్నాలజీల స్వదేశీ అభివృద్ధి, తయారీని విస్తరణను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, పరాస్ డిఫెన్స్ Ê స్పేస్ టెక్నాలజీస్‌తో పాటుగా ఐజీ డ్రోన్స్ వంటి భారతీయ కంపెనీలు రక్షణ-కేంద్రీకృత డ్రోన్ ఆవిష్క రణలో ముందంజలో ఉన్నాయి.
‘మేక్ ఇన్ ఇండియా’ కింద దేశం విస్తృతంగా రక్షణరంగంలో కొత్తకొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు తయారు చేస్తూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, స్వదేశీ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ.1.27 లక్షల కోట్లకు చేరుకుంది, దీనితోపాటుగాఎగుమతులు 2024-25లో రూ.23,622 కోట్లకు పెరిగాయి-2013-14 నుండి ఇది 34 రెట్లు పెరిగింది. అంతే కాకుండా భారత ప్రభుత్వం కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఐడెక్స్ , శ్రీజన్ వంటి కార్యక్రమాలను కూడా అమలు చేసింది. ఉత్పత్తిని సులభతరం చేయడానికి ఉత్తరప్రదేశ్, తమిళ నాడులో రక్షణ పారిశ్రామిక కారిడార్లను స్థాపించింది. గతంలో సొంతంగా తయారుచేసిన పరికరాలు ఉంటే 30-35 శాతం మాత్రమే ఉంటే. ఇప్పుడు 65 శాతం దాటింది.
భవిష్యత్తులో మరిన్ని ఉత్పత్తులతో సొంత టెక్నాలజీ వాటా 90 శాతానికి చేరుతుంది.