భారతీయనారి హిందూ కుటుంబానికి ఆధారం-2
యాజ్ఞవల్క్య మహర్షికి ఇద్దరు భార్యలు. ఒకరు మైత్రేయి. రెండవ భార్య కాత్యాయని. గృహస్థాశ్రమం తరువాత యాజ్ఞవల్క్య మహర్షి తన ఆస్తుల్ని ఇద్దరు భార్యలకు పంచి వానప్రస్థానానికి బయలుదేరాడు. కాత్యాయని ఆయనిచ్చిన భౌతిక సుఖ సంపదలతో సంతృప్తి పడిరది. రెండో భార్య మైత్రేయ నాకు అమృతత్వం ఇవ్వని భౌతిక సంపదలు వద్దని అమృతత్వమిచ్చే జ్ఞానమివ్వమని భర్తను కోరింది. అపుడు యాజ్ఞవల్క్యుడు ఆమెకు గురువై బ్రహ్మజ్ఞానం బోధించాడు. బృహదారణ్య కోపనిషత్తులో ఆత్మ, పరబ్రహ్మ అనుసంధానం గురించి, అద్వైతం గురించి మాట్లాడేది. క్రీ.పూ 8వ శతాబ్దానికి చెందిన స్త్రీ ఆ రోజు మన దేశంలో స్త్రీలకున్న విద్యావకాశాలను చక్కటి ఉదాహరణ. ఆమె భారతీయ మహిళా మేధావులలో అగ్రగణ్యురాలు. జనకుడేలిన మిథిల ఆస్థానంలో మైత్రేయి తండ్రి మైత్రి పనిచేస్తుండేవాడు. జనకుడికి అద్వైతం గురించి చెప్పిన తల్లి మైత్రేయి. యాజ్ఞవల్క్య`మైత్రేయి సంవాదం చాలా ప్రసిద్ధమైనది. యాజ్ఞవల్క్యుడు ఉపనిషత్తులు ప్రచారం చేసేవాడు. ఆయన ఆశ్రమంలో ఎంతో మంది శిష్యులుండేవారు.
ప్రపంచ సుఖాలు వద్దన్న మైత్రేయిని చూసి యాజ్ఞవల్క్యుడు ఆశ్చర్యపోయాడు. ‘నిన్ను నువ్వు తెలుసుకోవడం, నీ ఆత్మను గురించి తెలుసుకోవడమే నిన్ను అమరత్వం వైపు నడిపిస్తుంది. నీలో ఉన్న భగవంతుణ్ణి ప్రేమించు అని చెప్పాడు.ఆ రోజుల్లో ఆస్తులంటే గోసంపద, వృక్ష సంపద, వ్యవసాయం, వాటిని కూడా మైత్రేయి వద్దంది. మైత్రేయి ఆధ్యాత్మికతత్వం ఏమిటంటే మనకిష్టమైన, సంబంధం ఉన్న వాళ్ల సుఖ దుఃఖాలను మనం స్పందించినట్లే, మనకు తెలియని, సంబంధంలేని వారిపట్ల కూడా స్పందించడమే ‘అంతా భగవంతుని లీల’గా అర్థం చేసుకోవడం అవుతుంది. మనం ఏం చేసినా మనవల్లే జరుగుతున్నది అని భావించడం కామప్రేరకంగా, అంతా భగవంతుని అనుగ్రహంగా భావించడం శ్యామ ప్రేరకంగా అర్థం చేసుకోవడమన్నమాట. సుఖం, దుఃఖం, మంచి, చెడు, వినోదం, విషాదం పట్ల ఒకే తీరుగా స్పందించమే అద్వైతమన్నమాట.
వేదకాలంలోని గొప్ప పండితురాళ్ళలో మరొకరు గార్గి. జ్ఞానంలో ఆమె ఎందరో మహర్షులను అధిగమించింది. ఆమె వాచక్ను మహర్షి కుమార్తె. ఋషి పుంగవుడైన యాజ్ఞవల్క్యుడినే ఆమె సవాలు చేసింది. జనక మహారాజు ఓసారి పండితుల సభ ఏర్పాటు చేశాడు. దేశం నలువైఫుల నుండి వచ్చిన ఋషిపుంగవులతో సహా యాజ్ఞవల్క్యుడు, గార్గి కూడా వచ్చారు. అందరిలో అత్యంత విద్యా సంపన్నులెవరో తెలుసుకుందామని జనకుడు ఓ వేయి ఆవులను తెప్పించి ప్రతి ఆవు కొమ్ములకు బంగారు సంచీలు వేలాడదీశారు. గొప్ప వేదాంత పండితులు ఎవరైనా ఉంటే గోవును ఇంటికి తీసుకు వెళ్లి వచ్చని ప్రకటన చేశారు. కాని ఎవరికి ధైర్యం చాలలేదు. యాజ్ఞవల్య్యుడు ధైర్యం చేసి ఆవులను ఆశ్రమానికి తీసుకెళ్లమని శిష్యుల్ని ఆజ్ఞాపించాడు. కాని అందుకు మిగిలిన వారు సమ్మతించలేదు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి గోవులను తీసుకువెళ్లమన్నారు. అంతలో ఒకరు ప్రశ్నవేశారు. యాజ్ఞవల్క్యుడు అందరికి సంతృప్తికరంగా సమాధానమిచ్చాడు. చివరకు గార్గి కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. వాటికి కూడా యాజ్ఞవల్క్యుడు సమాధానాలిచ్చాడు. ఆ సభలో పాల్గొన్న ఏకైక మహిళ, ఋషిక, గార్గి. గార్గి పేరు ఉపనిషత్తులలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
1500`500 బి.సి. కాలంలో ఎందరో మహిళలు వేదాలను చదివారు. అందులో గార్గి ఒకరు. క్రీ.పూ. 700 లో జన్మించింది. గార్గి పేరున గోత్రం కూడా వుంది. గార్గి అంటే ఆలోచింపచేసేది అని అర్థం. ఢల్లీిలో గార్గి పేరున ఒక కళాశాల ఉంది. ఆ కళాశాల 2016లో స్వర్ణోత్సవం జరుపుకుంది. గార్గి ఋషిక, మహిళలకు విద్య, సమానత్వం, సామాజిక న్యాయం గురించి ప్రబోధించేది. ఆమెను ఋషి పరంపరలోని నవరత్నాలలో ఒకరుగా భావిస్తారు. వేదాలను అభ్యసించేందుకు ఉపనయనం చేసుకుంది. యాజ్ఞవల్క్యుడికి పరబ్రహ్మ గురించి ఆమె అనేక ప్రశ్నలను సంధించింది. పరబ్రహ్మ గురించి ఎక్కువగా ప్రశ్నించవద్దని యాజ్ఞవల్క్యుడు వారిస్తాడు.
– హనుమత్ ప్రసాద్