ఉగ్రవాదంపై పోరాటం చేస్తుంటే.. పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోంది : భారత ఆర్మీ
భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందని కానీ, పాకిస్తాన్ ఇందులో జోక్యం చేసుకుంటోందని, ఇది విచారకరమని ఎయిర్ మార్షల్ ఏకె భారతి అన్నారు. ఈ పోరాటంలో పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకోవడం విచారకరమని, అదీ ఉగ్రవాదుల కోసం అని అన్నారు. అందుకే తాము ప్రతిస్పందననే ఎంచుకున్నామని అన్నారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సోమవారం రక్షణ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాక్ లోని నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ ఏయిర్ బేస్ లపై దాడి దృశ్యాలను, మరికొన్ని దృశ్యాలను రక్షణ శాఖ అధికారులు చూపించారు.
ఈ సందర్భంగా ఏకే భారతీ మాట్లాడుతూ ఉగ్రవాదులకు పాక్ మిలటరీ మద్దతుగా నిలవడం సిగ్గుచేటు అని అన్నారు. పాకిస్తాన్ మిలటరీ ఉగ్రవాదులకు అండగా నిలిచాయని, తాము ఉగ్రవాదులపై చేస్తున్న పోరాటాన్ని కాస్తా.. తమ పోరాటంగా మలుచుకున్నాయని అన్నారు. దీంతో భారత సైన్యం దిమ్మతిరిగే జవాబు ఇచ్చిందన్నారు. పాక్ సైన్యానికి ఏదైనా నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులని భారత రక్షణ శాఖ తేల్చి చెప్పింది. పాకిస్తాన్ దాడుల సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రుదుర్భేద్యంగా నిలిచాయని, పాక్ ఆటలను సాగనివ్వలేదని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ గురించి, పాక్ వైమానిక దాడులను భారత్ ఎలా తట్టుకుందని అడగ్గా… స్వదేశీ వాయు రక్షణ వ్యవస్థ, ఆకాశ్ వ్యవస్థ పనితీరు అద్భుతంగా వుందని,గత దశాబ్దకాలంలో భారత ప్రభుత్వం నుంచి వస్తున్న మద్దతు, ఇస్తున్న బడ్జెట్ కారణంగా శక్తిమంతంగా వాతావరణాన్ని నిర్మించామని ఏకే భారతీ తెలిపారు.పాక్ ఉపయోగించిన అనేక డ్రోన్లు మరియు ఇతర వాటిని కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్ మరియు హార్డ్ కిల్ కౌంటర్, యూఎన్ఎస్ వ్యవస్థలతో పాటు బాగా శిక్షణ పొందిన భారత వైమానిక రక్షణ సిబ్బంది కూడా పాక్ ఆగడాలను సమర్థవంతంగా తిప్పికొట్టిందని భారతీ వివరించారు. తమకి సంబంధించిన అన్ని వ్యవస్థలూ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని, భవిష్యత్తులో ఏవైనా మిషన్లను చేపట్టడానికి కూడా సిద్ధంగా వున్నాయని భారతీ ప్రకటించారు.
పాకిస్తాన్, పీఓకేలో ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేశామని, పీఓకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైందని కూడా భారతీ ప్రకటించారు. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా యుద్ధం చేశామని, అత్యాధునిక క్షిపణి రక్షక వ్యవస్థలతో పాక్ క్షిపణులు, డ్రోన్లను తిప్పికొట్టామన్నారు. మన సైన్యానికి, ప్రజలకు భారీ నష్టం వాటిల్లకుండా చూశామని, స్వదేశీ సాంకేతికతతో తయారైన ఆకాశ్ ను ఈ ఆపరేషన్ లో సమర్థవంతంగా వినియోగించామని ప్రకటించారు. చైనా తయారు చేసిన పీఎల్ 15 క్షిపణిని కూల్చేశామని, పాక్ కి చెందిన అనేక డ్రోన్లు, మిస్సైళ్లను కూడా కూల్చేశామని భారతీ వివరించారు.