స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరీన్ ప్రారంభం
భారతదేశం తన నాలుగో న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరీన్‌ను (ఎస్ఎస్‌బిఎన్) ఈ వారంలోనే పెద్ద హడావుడి లేకుండా ప్రారంభించింది. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన ఈ జలాంతర్గామిని విశాఖపట్నంలోని నౌకా నిర్మాణ కేంద్రం (షిప్ బిల్డింగ్ సెంటర్) నుంచి ఈ నెల 16న ప్రారంభించారు.
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2024 ఆగస్టు 29న రెండవ అణ్వస్త్ర జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్‌ను జలప్రవేశం చేయించారు. మూడో అణ్వస్త్ర జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధమాన్ వచ్చే యేడాది జలప్రవేశం చేస్తుంది. మరో రెండు అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన జలాంతర్గాముల నిర్మాణానికి కేంద్రప్రభుత్వపు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నెల 9న ఆమోదముద్ర వేసింది.
ఎస్ఎస్‌బిఎన్ శ్రేణిలో నాలుగోదైన ఈ జలాంతర్గామి న్యూక్లియర్ డిటరెన్స్ స్ట్రాటెజీ గురించి మోదీ ప్రభుత్వం గోప్యంగా ఉంచింది. దాన్ని ఎస్-4 అనే కోడ్‌నేమ్‌తో వ్యవహరిస్తున్నారు. తెలంగాణ వికారాబాద్ వద్ద దామగుండంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ నేవల్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మర్నాడు అంటే అక్టోబర్ 16న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నాలుగో జలాంతర్గామిని ప్రారంభించారు.
ఈ ఎస్ఎస్‌బిఎన్ ప్రత్యేకత ఏంటంటే సుమారు 75శాతం జలాంతర్గామిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసారు. దానికి కె-4 బాలిస్టిక్ క్షిపణులు అమర్చారు. ఆ మిసైల్స్ 3500 కిలోమీటర్లు ప్రయాణించగలవు. వాటిని వెర్టికల్ లాంచింగ్ సిస్టమ్స్‌తో ప్రయోగించవచ్చు.
ఎస్ఎస్‌బిఎన్ శ్రేణిలో మొదటి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్, 750 కిలోమీటర్ల రేంజ్ ఉన్న కె-15 అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగలదు. దాని తర్వాతివైన రెండవ, మూడవ, నాలుగవ జలాంతర్గాముల మీద కె-4 మిసైళ్ళను ప్రత్యేకంగా అమర్చారు. వీటి ప్రత్యేకత ఏంటంటే వీటి పరిధికి పరిమితులు లేవు. ఆహార పదార్ధాల సరఫరా, సిబ్బంది అలసట, నిర్వహణ అవసరాల వంటి పరిమితులను మినహాయిస్తే ఈ జలాంతర్గాములు ఎంతకాలమైనా సముద్రంలో ఉండగలవు, ఎంత రేంజ్ ఉన్న క్షిపణులనైనా ప్రయోగించగలవు.
ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ ఇప్పటికే సముద్రగర్భంలో గస్తీ (డీప్-సీ పేట్రోల్) తిరుగుతున్నాయి. 2028 నాటికి రష్యా నుంచి అకులా క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ అటాక్ సబ్‌మెరీన్ అందుతుంది. ఈ యేడాది డిసెంబర్ నాటికి ఆరవ డీజెల్ ఎలక్ట్రిక్ కల్వరి క్లాస్ సబ్‌మెరీన్ ఐఎన్ఎస్ వాగ్షీర్ జలప్రవేశం చేసే అవకాశముంది.
భారత్‌కు మూడువైపులా ఉన్న సాగర జలాల్లోని చిన్నచిన్న దేశాలను తన గుప్పెట్లో పెట్టుకుంటూ మన దేశానికి ప్రమాదకరంగా మారుతున్న చైనా వంటి దేశాల నుంచి కాపాడుకోడానికి మన రక్షణ వ్యూహంలో ఎస్ఎస్‌బిఎన్‌లు చాలా ప్రధానమైనవి. మన దేశం రెండు విమాన వాహక నౌకలను తయారు చేసుకుంది. అయితే చైనాకు చెందిన డాంగ్‌ఫెంగ్ 21, 26 వంటి లాంగ్‌రేంజ్ మిసైళ్ళు వాటిని సులువుగా ధ్వంసం చేయగలవు. అందుకే మూడో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ కంటె న్యూక్లియర్ సబ్‌మెరీన్‌ల తయారీకి భారతప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది.
వీటితో పాటు ఫ్రెంచ్ నౌకావిభాగంతో కలసి మరో మూడు అడ్వాన్స్‌డ్ డీజెల్ అటాక్ సబ్‌మెరీన్స్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తద్వారా హిందూమహాసముద్ర ప్రాంతంలో భారతదేశపు భద్రత మరింత పటిష్ఠం కానుంది.