స్వదేశీ విధానమే అభివృద్ధికి తారకమంత్రం

స్వదేశీ అంటే మన దేశానికి సంబంధించినది అని అర్థం. ఏ దేశమైనా, ఏ సమాజపు జీవన విధానమైనా ప్రధానంగా ఆ దేశంలోని సాంస్కృతిక, భౌగోళిక పరిస్థితులపైన, ప్రకృతి వనరులపైనా ఆధారపడి ఉంటుంది. తమ సాంస్కృతిక, భౌగోళిక విలువలు దెబ్బతినకుండా స్వదేశంలోని వనరులను వినియోగించుకుంటూ అభివృద్ధి చెందటం ఒక విధానం. తమ దేశంలో లభించని వస్తువులను, ముడి సరుకును దిగుమతి చేసుకుని దానిని స్వదేశీ పరిజ్ఞానంతో అనుసంధానించి అభివృద్ధిచెందటం మరో విధానం. స్వదేశీ కేవలం ఆర్థిక సంబంధ మైనది మాత్రమే కాదు. విద్య, వైద్యం, నిర్మాణ, తయారీ రంగాల్లో మనదైన విజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఎంతో ప్రగతి సాధించాం.

వేయి సంవత్సరాల నిరంతర విదేశీ దాడులు, దోపిడీ మూలంగా ఆర్థిక వ్యవస్థతోపాటు, బ్రిటిష్‌ ‌కూటనీతి మూలంగా మన విద్య, వైద్య, వ్యవసాయ రంగ వ్యవస్థలు అన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. పాశ్చాత్య అనుకరణ, అవసరానికి మించి కొనుగోళ్ళు, విలాసాలు, వాటికోసం ఇతర దేశాలపై ఆధారపడటం మొదలైంది. పరాయిపాలన తొలగిన తరువాత కూడా నాటి నాయకులకు దూరదృష్టిలేని కారణంగా మితిమీరిన పారిశ్రామికీ కరణ వల్ల వృత్తివిద్యలు నాశన మయ్యాయి. గ్రామీణ ఆర్థికవ్యవస్థ, పరస్పర సహకార పద్ధతి దెబ్బతిన్నాయి. వ్యవసాయరంగంలో కూడా ప్రయోగాలు, అధిక దిగుబడుల పేరుతో విదేశీ విత్తనాలు, పద్ధతులు, ఎరువుల వాడకం వంటివి పెరిగి భూసారం దెబ్బతింది.

మనకు ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని శతాబ్దాల దోపిడి తరువాత కూడా అపారమైన సంపద మనకు ఉంది. అలాగే అంతులేని విజ్ఞానం మన సొత్తు. వివిధ రంగాలలో మన ప్రాచీన మహర్షులు, ద్రష్టలు, శాస్త్రవేత్తలు చేసిన కృషి, ప్రపంచానికి అందించిన మార్గదర్శనం వల్ల ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాం. విద్య, వైద్య, ఆరోగ్య, వ్యవసాయరంగాలలో మన ప్రాచీన పద్ధతులు ప్రపంచానికి ఈనాడు కూడా దిశానిర్దేశం చేస్తున్నాయి.

ఇటీవలి కాలంలో మన దేశంలో కూడా స్వదేశీ విధానాలపట్ల ఆసక్తితో పాటు ఆచరణ కూడా పెరిగింది. ఆరోగ్యరంగంలో, యోగ, ఆయుర్వేద, గోఆధారిత చికిత్సలు, వ్యవసాయంలో గోఆధారిత, ప్రాకృతిక పద్ధతులు పెరిగాయి. ప్రకృతి సిద్ధమైన వస్తు ఉత్పత్తి పెరిగింది. అయినా ఇంకా కొన్ని రంగాల్లో స్వదేశీ విధానాన్ని పెంపొందించుకోవాల్సి ఉంది. అవసరానికి మించి ఇతర దేశాలపై ఆధారపడటం ఎప్పుడూ మంచిదికాదు. ప్రస్తుతం చైనావల్ల మనకు చిక్కులు కలగడానికి ఒక కారణం అదే.

స్వదేశీతో ముడిపడిన మరో అంశం ‘స్వావలంబన’. మన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయటం, మనకు అవసరమైన మేరకు దిగుమతులు చేసుకోవడంలో తగిన నిష్పత్తిని పాటించి, ఇతరులపై ఆధారపడటం తగ్గించు కోవడమే స్వావలంబన. అదే ‘ఆత్మనిర్భర భారత్‌’.

అయితే స్వదేశీ విధానాన్ని పరిశ్రమలు, వస్తు ఉత్పత్తి రంగం అనుసరిస్తే చాలదు. వినియోగ దారులు, ప్రజలు కూడా దానిని అనుసరించినప్పుడే సరైన మార్పు సాధ్యపడుతుంది. అందువల్ల తమ స్థాయిలో ప్రజలు విదేశీ మోజును తగ్గించుకుని స్వదేశీ ఉత్పత్తులను వాడాలి. ‘మన సంస్కృతి, మన విజ్ఞానం, మన సాహిత్యం, మన భాష, మన ఆహారం, మన వేషం’ ఇలా అన్నింటిలో మనదైన, శ్రేష్టమైన విధానాన్ని ఆచరణలోకి తేవాలి. అప్పుడే అన్నిరంగాల్లో స్వావలంబన సాధించగలుగుతాం. ‘స్వదేశీ’ భావనకు ఉదాహరణ రూపంగా నిలువగలుగుతాం.

– పద్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *