‘‘స్వచ్ఛత’’లో ఇండోర్ ఫస్ట్… వరుసగా ఎనిమిదో సారి అవార్డు
స్వచ్ఛ సంరేక్షణ్, పరిశుభ్రతలో ఇండోర్ పట్టణం మరోసారి తన రికార్డును సొంతం చేసుకుంది. ఒకటి, రెండు, మూడుసార్లు కాదు.. ఏకంగా వరుసగా ఎనిమిది సార్లు పరిశుభ్రతలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకొని, రికార్డు నెలకొల్పింది. దేశంలోనే అత్యంత క్లీన్ సిటీగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ తొలి స్థానం దక్కించుకుంది. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించింది. గతేడాది ఇండోర్ తో పాటు సూరత్ కూడా తొలి స్థానాలు దక్కించుకున్నాయి. ఈ సారి మాత్రం ఇండోర్ తొలి స్థానాన్ని సంపాదించుకుంది. సూరత్ రెండో స్థానానికి వెళ్లిపోయింది. ఇక మూడో స్థానంలో నవీ ముంబై వుంది. ఢిల్లీ వేదికగా గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రదానం చేశారు.
ఇక.. 3-10 లక్షల జనాభా జాబితాలో నొయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా అవతరించింది. తర్వాత చండీగఢ్, మైసూర్ నిలిచాయి. ఈ మిషన్ కింద 4,500 నగరాలను పరిశీలిస్తారు. పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణ, సేవల అందుబాటు వంటి కొలమానాలను పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ యేడాది స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులిచ్చే సమయంలో నాలుగు విభాగాలుగా విభజించారు. అందులో మొదటిది సూపర్ స్వచ్ఛలీగ్ నగరాలు, ఐదు రకాలుగా ప్రజలను వర్గీకరించి, టాప్ 3 క్లీన్ సిటీలు, గంగా పట్టణాలు, కంటోన్మెంట్ బోర్డులు, సఫాయిమిత్ర సురక్ష, మహాకుంభ్, రాష్ట్ర స్థాయి అవార్డులుగా విభజించారు.

SBM-U కింద ఒక మైలురాయి చొరవ అయిన స్వచ్ఛ సర్వేక్షణ్ (SS), గత తొమ్మిది సంవత్సరాలుగా భారతదేశ పట్టణ పరిశుభ్రత ప్రయాణంలో ఓ మైలురాయి. అవార్డులు ప్రకటించడం వల్ల పోటీతత్వం, స్వచ్ఛత విషయంలో ప్రజల్లో ఆసక్త పెరిగింది. 45 రోజుల పాటు దేశ వ్యాప్తంగా ప్రతి వార్డులో 3,000 కి పైగా వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు.సమగ్రత, పారదర్శకత, నిబద్ధతో వీటిని పరిశీలించి, అవార్డులను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ కి 5 అవార్డులు…
స్వచ్ఛ సర్వేక్షణ్ లో ఐదు అవార్డులకు 5 నగరాలు ఎంపికయ్యాయి. గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు అవార్డులు దక్కాయి. సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డుల్లో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కేటగిరీలో విజయవాడ, 3-10 లక్షల్లోపు కేటగిరీలో గుంటూరు, 50 వేల నుంచి లక్ష లోపు జనాభా కేటగిరీలో తిరుపతి నగర పాలక సంస్థలు అవార్డులు పొందాయి.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫస్ట్…
క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ కింద ఇచ్చిన అవార్డుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ తొలి స్థానాన్ని దక్కించుకుంది. వ్యర్థాల రహిత నగరం కేటగిరీలో హైదరాబాద్ 7 స్టార్ రేటింగ్ ను సాధించింది. గతంలో 5 స్టార్ రేటింగ్ వుండేది.