అవిముక్తేశ్వరానంద చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధం : ఇంద్రేష్ కుమార్
జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద ఆరెస్సెస్ జ్యేష్ఠ ప్రచారక్ ఇంద్రేష్ కుమార్ పై తీవ్ర ఆరోపణలను చేశారు. ఈ ఆరోపణలను ఇంద్రేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. స్వామి అవిముక్తేశ్వరానంద చేసిన ప్రకటన పూర్తిగా అబద్ధమని, తప్పుదోవ పట్టించేలా వుందని, అవమానకరమైందని తీవ్రంగా ఆక్షేపించారు.
భారత్ లో సాధువులు, సన్యాసుల పట్ల గౌరవ భావం వుంటుందని, అది ప్రగాఢ విశ్వాసానికి సంబంధించిన విషయమని ఇంద్రేష్ కుమార్ అన్నారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సాధువులందర్నీ అత్యంత గౌరవంగా, భక్తితో చూస్తుందన్నారు. స్వామి అవిముక్తేశ్వరానంద తన పేరును ఉపయోగించడం పూర్తిగా అనుచితమని, ఆయన వ్యాఖ్యలు నిరాధారమని ఇంద్రేష్ కుమార్ తోసిపుచ్చారు. తప్పుడు ప్రకటనలు చేయడం సాధువుల గౌరవానికి ఏమాత్రం తగదని హితవు పలికారు. ఆ తప్పుడు ప్రకటనలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఆరెస్సెస్ ఎప్పుడూ దేశంలో వున్న పుణ్యమైన సంప్రదాయాన్ని గౌరవించే సంస్థ అని నొక్కి చెప్పారు. స్వామీజీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమైనవని అన్నారు.
ఇంతకీ అవిముక్తేశ్వరానంద ఏమన్నారంటే…
తాను విమానాశ్రయం లాంజ్ లో ప్రచారక్ ఇంద్రేష్ కుమార్ తో కలిశానని, ఈ సంభాషణల్లో ముస్లిం రాష్ట్రీయ మంచ్ ద్వారా సుమారు పది లక్షల మంది హిందూ బాలికలకు ముస్లిం కుటుంబాలతో వివాహాలు చేసినట్లు ఇంద్రేష్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా హిందూ సమాజానికి ఇది తీరని ద్రోహమని, ఆరెస్సెస్ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు. ఈ ఆరోపణలనే ఆరెస్సస్ ప్రచారక్ ఇంద్రేష్ కుమార్ తీవ్రంగా ఖండించారు.