స్వదేశీ టెక్నాలజీతో రక్షణ రంగంలో పటిష్ఠత దిశగా భారత్
భారత్ అత్యంత వేగంగా ఆత్మ నిర్భర భారత్ వైపు ప్రయాణిస్తోంది. స్వదేశీ టెక్నాలజీతో యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతోంది. కేవలం జరగడమే కాదు.. ఏకంగా రంగంలోకి కూడా దిగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఆండ్రోత్.. తాజాగా ఐఎన్ఎస్ తారాగిరి. విశాఖ నేవల్ డాగ్ యార్డులో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా దీనిని కమిషన్ చేశారు.
స్టెల్త్ సాంకేతికతతో రూపొందించిన ఈ ఫ్రిగేట్ భారత సముద్ర సరిహద్దు రక్షణలో కీలక పాత్ర పోషించనుంది. నీలగిరి శ్రేణి 17-ఏ లో నాలుగో ప్రాజెక్టుగా ఈ యుద్ధ నౌకను ముంబైలోని మజగాన్ డాగ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లో నిర్మించారు. స్వదేశీ ఆధునిక సాంకేతికత వినియోగంలో 75 శాతానికి పైగా సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పారిశ్రామిక రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. శత్రువుల రాడార్ లకు కనిపించకుండా పనిచేసే సామర్థ్యం తారాగిరి సొంతం.
149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పుతో 6,670 టన్నుల బరువు వుంటుంది. కంబైన్డ్ డీజిల్ – గ్యాస్ ఆధారిత ప్లాంటుతో సముద్ర జలాల్లో గంటకు 28 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది.
ఇందులో నిశ్శబ్దమైన ఫిరంగులతో కూడిన ఆధునికత సాంకేతికత వుంటుంది. బరాక్ -8 వంటి విమాన విధ్వసంక, 8 బ్రహ్మోస్ నౌకా విధ్వంసక క్షిపణులు ఇందులో వున్నాయి.
యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ వ్యవస్థతో పాటు శత్రువుల జాడను, ముప్పును ముందే పసిగట్టే రాడార్ వుంటుంది.
ఇలాంటి స్వదేశీ టెక్నాలజీతో మన దేశానికి కావాల్సిన వాటిని మనమే తయారు చేసుకుంటున్నాం. దీని ద్వారా భారత్ కీలక మార్పు కూడా చోటు చేసుకుంది. ప్రపంచంలో రక్షణ రంగంపై అత్యధికంగా ఖర్చు చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో వుంది. 2025 లో మన దేశం ఈ రంగంపై 92.1 బిలియన్ డాలర్లు ఖర్చే చేసింది. అమెరికా, చైనా, రష్యా, జర్మనీలు ఈ జాబితాలో కూడా వున్నాయి. స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం ఓ నివేదికను విడుదల చేసింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ రక్షణ వ్యూాహాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సంప్రదాయ యుద్ధశైలికి భిన్నంగా డిజిటల్ వార్, రక్షణ వ్యవస్థలను భారత్ సిద్ధం చేసుకుంటోంది. దీనికి గానూ తన అంతరిక్ష రక్షణ వ్యవస్థ కోసం ముూడంచెల వ్యవస్థలను మోహరిస్తోంది. అందులో ప్రధానంగా ఎస్-400 స్క్వాడ్రన్ లను అమ్ముల పొదిలో చేర్చుకుంటోంది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పాకిస్థాన్ సరిహద్దుల్లో అత్యంత పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను నిర్మిస్తోంది. రష్యా నుంచి మే నెలలో మరో ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ భారత్‌కు చేరుకోనుంది. దీన్ని రాజస్థాన్, పంజాబ్ సెక్టార్లలో మోహరించనున్నారు. ఈ ప్రాంతాలకు డ్రోన్లు, క్షిపణుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ కొత్త ఎస్-400 స్క్వాడ్రన్ ఆ ముప్పును అడ్డుకుని సరిహద్దుల్లో ఎటువంటి లోపాలు లేకుండా చేస్తుంది.