బీమా కోరేగావ్ యుద్ధం – చారిత్రక సత్యాలు
మహారాష్ట్రలోని బీమా కోరేగావ్ దగ్గర 1818 జనవరి 1న బ్రిటిష్ , మరాఠా సైన్యాల మధ్య యుద్ధం జరిగింది. అందులో ఎవరూ విజయం సాధించలేదు. ఇటీవల ఈ యుద్ధాన్ని గురించి అనేక అపోహలు, దురభిప్రాయాలు ప్రచారంలోకి వచ్చాయి. దీనితో నిజానికి ఆ యుద్ధంలో ఏం జరిగిందన్నది తెలుసుకోవడం అవసరమైంది.
- బీమా కోరేగావ్ యుద్ధం ఏమిటి?
ఇది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం, పీష్వా బాజీరావు II నేతృత్వంలోని మరాఠా సైన్యం మధ్య జరిగిన ఒక రోజు యుద్ధం.
- ఈ యుద్ధం ఎందుకు జరిగింది?
మరాఠా కూటమి (పూనాకు చెందిన పీష్వా, గ్వాలియర్ సిందియాలు, ఇండోర్ కు చెందిన హోల్కర్ లు, బరోడా గైక్వాడ్ లతో కూడినది) భారత్ లో ముఖ్యమైన సామ్రాజ్యాల్లో ఒకటి. 1770-1817 మధ్యకాలంలో జరిగిన ఆంగ్లో – మరాఠా యుద్ధాల తరువాత క్రమంగా బ్రిటిష్ వాళ్ళు పైచేయి సాధించారు. జూన్ 1817లో జరిగిన మూడవ ఆంగ్లో- మరాఠా యుద్ధంలో మరాఠాలు ఓడిపోవడంతో తమ రాజధాని అయిన పూనా వదిలి పీష్వా సురక్షిత ప్రాంతానికి వెళిపోవలసివచ్చింది.
- బీమా కోరేగావ్ నిర్ణాయక యుద్ధమా?
కాదు. ఈ యుద్ధం 1818 జనవరి 1న జరిగింది. అప్పటికే, అంటే 1817 నవంబర్, 17నాటికే, పీష్వా పూనా వదిలి వెళిపోయాడు. ఆ రోజునే పూనా కోటపై బ్రిటిష్ జెండా (యూనియన్ జాక్) ఎగురవేశారు. ఈ యుద్ధం తరువాత జరిగిన పరిణామాల్లో మరాఠా సామ్రాజ్యం పూర్తిగా పతనమయింది. దానితో బ్రిటిష్ వాళ్ళు భారత్ ను పూర్తిగా చేజిక్కించుకున్నారు. ఛత్రపతి ప్రతాప్ సింహ్ మహరాజ్ ను బెనారస్ కు, పీష్వా బాజీరావ్ II ను బితూర్ కు ప్రవాసం పంపారు. అప్పుడు మొదలైన బ్రిటిష్ పాలన చీకటి అధ్యాయం ఆ తరువాత 150 ఏళ్లపాటు సాగింది. ఈ సుదీర్ఘ కాలంలో కిరాతకమైన బ్రిటిష్ విధానాల మూలంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.
- పూనాను వదిలిపెట్టిన తరువాత పీష్వా బాజీరావ్ II నేతృత్వంలోని మరాఠా సైన్యం ఎక్కడికి వెళ్లింది?
పీష్వా బాజీరావ్ II అక్కడ నుంచి సతారా వెళ్ళి 28వేల మందితో (20వేల అశ్వికులు, 8వేల ఫిరంగులు)సైన్యం తయారుచేసుకుని బ్రిటిష్ వారి(ఈస్ట్ ఇండియా కంపెనీ) అధీనంలో ఉన్న పూనాపై దాడికి సిద్ధపడ్డాడు.
- పీష్వా ఎవరు?
మరాఠా సామ్రాజ్యంలో ప్రధాన మంత్రిని పీష్వా అంటారు.
- బీమా కోరేగావ్ యుద్ధం ఎందుకు జరిగింది?
పీష్వా బాజీ రావు IIకు చెందిన మరాఠా సైన్యాన్ని జనరల్ స్మిత్ నాయకత్వంలోని అపారమైన బ్రిటిష్ సైన్యం వెంటాడింది. కల్నల్ బర్ సైన్యం పూనాను ముట్టడించింది. తమను వెంబడిస్తున్న స్మిత్ సైన్యం నుండి తప్పించుకున్న పీష్వా మరికొంత సైన్యాన్ని కూడగట్టుకుని పూనా తిరిగివచ్చాడు. మరాఠా సైన్యం తిరిగి వస్తోందని తెలుసుకున్న కల్నల్ బర్ అదనపు బలగాలు పంపాలని సందేశం పంపాడు. శిరూర్ వద్ద ఉన్న బ్రిటిష్ బలగాలను సహాయం కోరాడు. దానితో లెఫ్టినెంట్ ఫ్రాన్సిస్ స్టాంటన్ నాయకత్వంలో కొంత సైన్యం శిరూర్ నుండి బయలుదేరి పూనా వైపు వచ్చింది. రాత్రంతా ప్రయాణించి ఆ బలగాలు ఉదయం 10 గం.లకు తలగోన్ గ్రామానికి చేరాయి. జనవరి, 1818న వాటికి బీమా నది అవతల మరాఠా సైన్యం ఎదురుపడింది. అప్పుడు యుద్ధం జరిగింది. దీనినిబట్టి ఈ యుద్ధం అనుకోకుండా జరిగినదేనని, ముందస్తు ప్రణాళికతో, సన్నద్ధతతో జరిగినది కాదని తెలుస్తోంది.
- బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఏ దళాలు బీమా కోరేగావ్ యుద్ధంలో పాల్గొన్నాయి?
యుద్ధంలో మొత్తం 824 మంది బ్రిటిష్ సైనికులు పాల్గొన్నారు. అందులో 24మంది యూరోపియన్ గన్నర్స్, ముంబై ఫిరంగి దళం 2వ బెటాలియన్ కు చెందిన 500 మంది, పూనా అశ్వదళానికి చెందిన 300మంది అశ్వికులు, ఫ్రాన్సిస్ స్టాటన్ నాయకత్వంలోని ఆరు పొండ్ ల తుపాకులు కలిగిన సేన పాల్గొన్నాయి. బ్రిటిష్ సైన్యంలో యూరోపియన్ లు, ముస్లింలు, మరాఠాలు, మహార్ లు, రాజపుత్రులు, కొద్దిమంది యూదులు కూడా ఉన్నారు.
- మరాఠా సైన్యానికి చెందిన ఏ దళాలు బీమా కోరేగావ్ యుద్ధంలో పాల్గొన్నాయి?
బీమా కోరేగావ్ యుద్ధంలో 18వందల మరాఠా సైన్యం పాల్గొంది. మూడు దళాలకు చెందిన ఈ సైన్యంలో
అరబ్ లు (ముస్లింలు) – 600
గోసాయిలు – 600
అన్ని కులాలకు చెందిన మరాఠాలు – 600
మూడు దళాలకు బాపు గోఖలే, అప్పా దేశాయి, త్రయంబక్ జీ డెంగ్లే లు నాయకత్వం వహించారు.
- బీమా కోరేగావ్ యుద్ధం ఎంత కాలం సాగింది?
ఇది కేవలం ఒక రోజు యుద్ధం. ఉదయం 10 గం.ల నుండి రాత్రి 9 గం.ల వరకు జరిగింది.
- యుద్ధంలో చనిపోయినది ఎవరు?
మొత్తం 834 మంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైనికులు బీమా కోరేగావ్ యుద్ధంలో పాల్గొన్నారు. వారిలో 275మంది ప్రాణాలు కోల్పోవడమో, గాయపడటమో, గల్లంతు కావడమో జరిగింది. ఇద్దరు యూరోపియన్ సైనికాధికారులు చనిపోయారు. పదాతి దళంలో 50మంది చనిపోతే, 105మంది గాయపడ్డారు. ఫిరంగి దళంలో 12మంది చనిపోతే, 8మంది గాయపడ్డారు. ఇక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దళాల్లో పనిచేస్తు చనిపోయిన భారతీయ సైనికుల వివరాలు చూస్తే – 16మంది మరాఠాలు, 22మంది మహర్ లు, 8 రాజపుత్రులు, 2 ముస్లిములు, 2 యూదులు, 11మంది యూరోప్ సైనికులు ఉన్నారు.
మరాఠా సైన్యం వైపు 500 – 600 మంది చనిపోవడమో, గాయపడతామో జరిగిందని అంచనా.
- రెండు పక్షాల్లో ఏదైనా తాము గెలిచినట్లు ప్రకటించుకుండా?
లేదు. రాత్రికి యుద్ధం క్రమంగా ఆగిపోయింది, మరునాడు ఉదయానికల్లా మరాఠా సైన్యం ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోయింది. తాము గెలిచామని ఏ బ్రిటిష్ అధికారీ ప్రకటించలేదు. `బ్రిటిష్ విజయాన్ని’ గురించి ఏ అధికారి ప్రకటన బ్రిటిష్ పత్రాల్లో ఎక్కడా లేదు. బీమా కోరేగావ్ దగ్గర ఉన్న స్మృతి ఫలకంపై కూడా `అది కోరేగావ్ రక్షణకు ప్రయత్నించినందుకు’ గుర్తుగా ఏర్పాటు చేసినట్లు మాత్రమే ఉంది.
- బీమా కోరేగావ్ దగ్గర స్మారక స్థూపాన్ని ఎవరు ఏర్పాటుచేశారు?
బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ
- ఆ స్మారక స్తూపం ఎప్పుడు ఏర్పాటుచేశారు?
బీమా కోరేగావ్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన బ్రిటిష్ సైనికుల స్మృత్యర్ధం ఒక స్మారకాన్ని ఏర్పాటుచేయాలని ఎలిఫిన్ స్టోన్ 1818 జులై 6న వారన్ హేస్టింగ్స్ కు ఒక ఉత్తరం వ్రాశాడు. ఆ అభ్యర్ధన స్మారకానికి సంబంధించిన నమూనా రూపొందించే పని మద్రాస్ ఫిరంగి దళంలోని జాన్ విలే కి అప్పగించారు. స్మారక నిర్మాణం 1822లో పూర్తయింది. స్థూపంపై చనిపోయిన, గాయపడిన బ్రిటిష్ సైనికుల పేర్లు చెక్కారు.
- బీమా కోరేగావ్ స్మారకం దేనిని సూచిస్తుంది?
ఇది `ప్రాచ్య దేశాల్లో బ్రిటిష్ సైన్యం సాధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన యుద్ధ విజయానికి’ గుర్తు. స్థానిక పాలకుడిపై విదేశీ శక్తి విజయానికి ప్రతీక.
- స్మారక స్థూపం పై ఏమి చెక్కారు?
బీమా కోరేగావ్ స్మారక స్థూపం ఉన్న ప్రదేశంలో రెండు రాతి చెక్కడాలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి, బీమా కోరేగావ్ యుద్ధాన్ని గురించి సంక్షిప్తంగా వివరించే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటుచేసిన ఫలకం. రెండవది, ఆ తరువాత కాలంలో వివిధ యుద్ధాల్లో పాల్గొన్న పూనా ఆశ్వానికి `గౌరవంగా’, గుర్తుగా ఏర్పాటుచేసిన ఫలకం.
స్మారక స్థూపానికి రెండు వైపుల బీమా కోరేగావ్ గురించిన సంక్షిప్త వివరణ ఆంగ్లంలో ఉంటుంది. యుద్ధంలో పాల్గొన్న యూరోప్ అధికారులు, చనిపోయిన, గాయపడిన బ్రిటిష్ సైనికుల పేర్లు కూడా అందులో కనిపిస్తాయి.