‘‘పంచ పరివర్తన్’’పరివర్తనాత్మక దృక్పథాన్ని అందిస్తుంది : హోసబళే
ఆరెస్సెస్ కార్య శతాబ్ది సందర్భంగా ప్రతిపాదించిన పంచ పరివర్తన్ (కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, పౌరవిధులు) సమాజం కోసం ఓ పరివర్తనాత్మక దృక్పథాన్ని అందిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. కుల, గిరిజన విభజనలకు అతీతంగా సామాజిక సామరస్యాన్ని పెంపొదిస్తూ, జాతీయ ఆత్మ గౌరవాన్ని, స్వదేశీ చైతన్యాన్ని బలపరుస్తుందన్నారు. అలాగే కుటుంబ విలువలను పరిరక్షిస్తుందని, పర్యావరణాన్ని రక్షించే బాధ్యతను దైనందిన కార్యకలాపాలలో భాగం చేస్తుందన్నారు.
సంఘ కార్య శతాబ్ది సందర్భంగా మేఘాలయాలో ప్రతిష్ఠిత వ్యక్తుల సమ్మేళనం జరిగింది. ఇందులో దత్తాత్రేయ హోసబళే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానంద, రవీంద్ర నాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి ప్రముఖులతో షిల్లాంగ్ కి వున్న సంబంధాన్ని గుర్తు చేశారు. అలాగే వందేళ్ల సంఘ ప్రస్థానాన్ని కూడా పేర్కొన్నారు.
1925 లో ఒకే ఒక్క శాఖ ప్రారంభమైందని, ఇప్పుడు 85 వేలకు నిత్య శాఖలు విస్తరించాయని తెలిపారు. అలాగే హెడ్గేవార్ జీవితాన్ని కూడా వివరిస్తూ, స్వాతంత్ర ఉద్యమంలో వివిధ వర్గాలతో డాక్టర్జీకి అనుబంధం వుండేదని గుర్తు చేశారు. సాంస్కృతికంగా సుసంపన్నమైన భారత్ స్వాతంత్రాన్ని ఎందుకు కోల్పోయిందన్న ప్రాథమిక ప్రశ్నకు సమాధానం వెతకడానికే డాక్టర్జీ నిరంతరం ప్రయత్నించేవారని అన్నారు.
సామాజికంగా విచ్ఛిన్నమైన సమాజంపై విదేశీ శక్తులు పాలన సాగిస్తున్నాయన్న విషయాన్ని డాక్టర్జీ గమనించారని, అందుకే సామాజిక సంఘటన, జాతీయ చైతన్యం ఆవశ్యకతను నొక్కి చెప్పారని, ఇదే ఆరెస్సెస్ స్థాపనకు దారి తీసిందన్నారు. సంఘ్ ఓ సంస్థగానే మిగిలిపోవాలని అనుకోవడం లేదని, యావత్ సమాజాన్ని సంఘటితం చేయాలని కోరుకుంటోందని పునరుద్ఘాటించారు.
భారతదేశ భాషా, సాంస్కృతిక వైవిధ్యం జాతీయ ఐక్యతను బలహీనపరచదని, క్రీడా విజయం లేదా చంద్రయాన్-II ప్రయోగం వంటి సామూహిక విజయాల సందర్భాలలో ఈ ఐక్యత స్పష్టంగా ద్యోతకమవుతూనే వుందని ఉదహరించారు. అయితే… వ్యక్తి నిర్మాణం ద్వారా ఐక్యతను శాశ్వతం చేయాలని సంఘ్ ప్రయత్నిస్తోందని తెలిపారు.
వివిధ వృత్తులు, సామాజిక రంగాలలో స్వయంసేవకులు నిమగ్నమయ్యారని, వారి ద్వారా సమాజాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. సామాజిక పరివర్తన అనేది కేవలం ఆచారాల కన్నా నైతిక బాధ్యత ఇది అన్న కోణంలో ఆలోచించే వ్యక్తులు, కుటుంబాలతో ప్రారంభం కావాలని అన్నారు.
ఇక… పెరుగుతున్న మాదకద్రవ్యాల ముప్పుతో సహా పలు సమకాలీన ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. దీనిని ఆయన జీవనశైలి మరియు భద్రతకి సంబంధించిన సవాల్ అని అభివర్ణించారు. ఇలాంటి వాటికి బలమైన కుటుంబ వ్యవస్థ ఆపగలదని, అలాగే సరిహద్దులను పటిష్టం చేయడం ద్వారా దీని సరఫరాను అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు.