ఐఎస్ఐఎస్ కీలక నేత మృతి..
నిషేధిత ఉగ్రవాద సంస్థ సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) ఇండియా చీఫ్, మాజీ జనరల్ సెక్రెటరీ సాకిబ్ నాచన్ మృతి చెందాడు. ఢిల్లీోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని అధికారులు వెల్లడించారు. వివిధ కేసుల్లో నిందితుడిగా వున్న నాచన్ ను జాతీయ దర్యాప్తు సంస్థ 2023 లో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో వున్నాడు.
ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. అతనికి సెరిబ్రల్ హెమరేజ్ వచ్చిందని వైద్యులు నిర్ధారించారు. నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలోనే వున్నాడు. పరిస్థితి దిగజారడంతో మృతి చెందాడు. ఢిల్లీ, మహారాష్ట్ర, పడ్గాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద మాడ్యుల్ ను ఏర్పాటు చేయడంలో అతని పాత్ర కీలకమని అధికారులు పేర్కొన్నారు.
సాకిబ్ స్వస్థలం థానే జిల్లాలోని పడ్గా. 1990,2000 సంవత్సరం ప్రారంభంలో సిమీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేశాడు. అయితే 2002-03 లో ముంబై వరుస దాడుల (ముంబై సెంట్రల్, విలే పార్లే, ములుండ్ స్టేషన్) సమయంలో నాచన్ పేరు బాగా వినిపించింది. ఆ దాడుల్లో 13 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు. వీటికి సంబంధించిన కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత 2023 లో ఐఎస్ఐఎస్ రిక్రూట్ మెంట్ లో కీలకంగా వున్నాడని ఎన్ఐఏ నాచన్ ను అరెస్ట్ చేసింది.