తిలకం పెట్టొద్దు.. జపమాల కనిపించొద్దు : ఇస్కాన్ సూచన

బంగ్లాదేశ్ లో హిందువులపై, ఇస్కాన్ సభ్యులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇస్కాన్ కీలక ప్రకటన చేసింది. ‘కాషాయం ధరించడం మానుకోండి.. తిలకం పెట్టకండి.. తులసి జపమాల ఎవరికీ కనపడనీయకండి’.. ఇదీ కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్‌లోని హిందువులకు, కృష్ణ భక్తులకు ఇచ్చిన సలహా. ఇలా చేసినప్పుడే మతఛాందసవాదుల నుంచి రక్షించుకోగలుగుతారని ఇస్కాన్‌ అక్కడి హిందువులకు సూచించింది.ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమణ్‌ దాస్.. బంగ్లాదేశ్‌లోని హిందువులు దేవాలయాలలో లేదా తమ ఇళ్లలో మాత్రమే తమ మతాచారాలను పాటించాలని, బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సంక్షోభ సమయంలో తమను తాము రక్షించుకునే దృష్టితో ఉండాలని ఆయన సలహా ఇచ్చారు. కాషాయ వస్త్రాలు ధరించవద్దని, నుదుటిపై తిలకం పెట్టుకోవద్దని రాధారమణ్‌ దాస్ సూచించారు. తులసిమాలను మెడలో ధరించాలనుకుంటే దానిని బయటకు కనిపించకుండా చూసుకోవాలని రాధారమణ్‌ దాస్‌ విజ్ఞప్తి చేసినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం వెలువరించింది.

బంగ్లాదేశ్‌లోని హిందువులు బయటకు సాధువులుగా కనిపించకుండా తమను తాము చూసుకోవాలని రాధారమణ్‌ దాస్ కోరారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు, ఇస్కాన్ సన్యాసులపై హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో ఒక చట్టపరమైన కేసులో ఆధ్యాత్మికవేత్త చిన్మయ్ కృష్ణ దాస్‌ను అరెస్టు చేశారు. న్యాయవాది రమణ్‌రాయ్‌పై దాడి జరిగింది. అతని పరిస్థితి విషమంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక బోధకుడు చిన్మయ్‌ కృష్ణ దాస్‌ను అక్టోబర్ 25న అరెస్టు చేసినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ జెండాను ఎగురవేసినందుకు ఆయనపై దేశద్రోహం కేసు నమోదైంది. దాస్ అరెస్టు అనంతరం నవంబర్ 27న చిట్టగాంగ్ కోర్ట్ బిల్డింగ్ ప్రాంతంలో పోలీసులకు, ఆధ్యాత్మిక గురువు అనుచరులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక న్యాయవాది మృతిచెందాడు.

బంగ్లాదేశ్‌లో పెరుగుతున్న హింసాయుత ఘటనలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ) ప్రదర్శన నిర్వహించింది. ఈ సందర్భంగా వీహెచ్‌పీ నేతలు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దురాగతాలను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *