బంగ్లాదేశ్ లో మళ్లీ హింస.. హిందువులపై దాడులు
బంగ్లాదేశ్ లో హిందువులపై, దేవాలయాలపై మళ్లీ దాడులు ప్రారంభమయ్యాయి. ముస్లిం ఛాందసులు సునమ్ గంజ్ జిల్లాలోని ఇళ్లు, దేవాలయాలు, దుకాణాలే లక్ష్యంగా హిందూ సమాజంపై దాడికి తెగబడ్డారు.దీంతో డోయ్రా బజార్ ప్రాంతంలో జరిగిన ఈ దాడులతో స్థానిక హిందువులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే వున్న దేవాలయంపై దాడులు చేసి, దేవతా విగ్రహాలను ధ్వంసం చేయడమే కాకుండా పవిత్రమైన వస్తువులను కూడా ధ్వంసం చేశారు. ఇదంతా ఓ పద్ధతి ప్రకారమే జరిగిందన్న అనుమానాలు స్థానిక హిందువుల్లో తలెత్తుతున్నాయి. మూర్తులను ధ్వంసం చేయడమే కాకుండా వాటిని చెత్త కుప్పల్లో వేయడం, హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించిన మొత్తం సీసీ టీవీల్లో రికార్డైంది.
కేవలం దేవాలయాలపై దాడుల వరకే ఛాందసులు ఆగలేదు. ఆ తర్వాత పెద్ద సంఖ్యలో స్థానిక వీధుల్లోకి వచ్చి, హిందువులకు సంబంధించిన గృహాలు, దుకాణాలే లక్ష్యంగా దాడులు చేసి, విధ్వంసం సృష్టించారు. దుకాణాల్లో లూటీలు చేశారు. ఈ భయానక వాతావరణం వల్ల హిందువులు తమ ఇళ్ల నుంచి పారిపోయారు. అంతేకాకుండా స్థానికంగా వుండే ఆకాష్ దాస్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టారు. అక్కడే సాయుధ బలగాలున్నా… ఈ హింసను చూస్తూ వుండిపోయారు తప్ప… ఆ హింసను ఆపేందుకు మాత్రం ప్రయత్నాలు చేయలేదు. హిందూ సమాజాన్ని రక్షించడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు.