నిర్దేశిత కక్ష్యలోకి ‘‘నిసార్’’…ప్రత్యేకతలివే..

అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. ఇస్రో, నాసా కలిసి అభివృద్ధి చేసిన నైసార్ ఉపగ్రహం ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నింగిలోకి GSLV-F16 వాహక నౌక 2,393 కిలోల బరువున్న నైసార్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనికోసం నాసా 1.16 బిలియన్ డాలర్లను సమకూర్చగా.. భారత్ 90 మిలియన్ డాలర్లను ఇచ్చింది. అంతరిక్షంలోకి ఇప్పటి వరకు చేర్చిన అత్యంత శక్తిమంతమైన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లలో ఇది ఒకటి.

ప్రయోగకేంద్రం సెకెండ్ లాంచ్ ప్యాడ్ నుంచి నిప్పులు చెరుగుతూ GSLV F -16 రాకెట్ నింగిలోకి ప్రవేశపెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిసార్ శాటిలైట్‌గా పేరున్న GSLV F – 16 నింగిలోకి మోసుకెళ్లింది.18ని 35 సెకండ్లలో ప్రయోగం పూర్తయినట్లు పరిశోధకులు ప్రకటించారు. భూమికి 747 కిలోమీటర్ల ఎత్తులో నిసార్ శాటిలైట్‌ని నిర్దేశిత అనువర్తిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు.. నింగిలోకి వెళ్లిన నిస్సార్‌ ఉపగ్రహం భూమిని స్కాన్‌ చేయడం ప్రారంభించినట్లు వారు వెల్లడించారు.

దీన్ని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ), నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) తొలిసారిగా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీంతో నైసార్‌ (నాసా-ఇస్రో సింథటిక్‌ అపర్చర్‌ రాడార్‌) అని పేరు పెట్టారు. వివిధ పరిశోధనల్లో కొత్త ఒరవడిని ఇది తీసుకురానుంది. రెండు సింథటిక్‌ అపర్చర్‌ రాడార్లు (సార్‌) అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే.

ఇప్పటికే యాక్సిమ్‌ మిషిన్‌ కింద భారత వ్యోమగామి అయిన శుభాంశు శుక్లాను అమెరికా అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన మనకు తెలిసిందే. తాజాగా నైసార్‌ భవిష్యత్తులో ఇచ్చే సమాచారంతో పంటలు, ప్రకృతి విపత్తులు, భూకంపాలు, హరికేన్లను అంచనావేసి.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావచ్చు. ఈ ఉపగ్రహం డేటా ఆధారంగా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుందని నాసా తెలిపింది. భూమి లోపల జరిగే మార్పులను అంచనా వేయడంలో ఉపగ్రహం భాగస్వామ్యం కానుంది.

దీని ప్రత్యేకతలు…

1. రెండు రాడార్లు భారీ డిష్ ఆకారంలో వుంటాయి. ఇవి భూమిపైకి మైక్రోవేవ్, రేడియో సంకేతాలు పంపి, తిరిగి వచ్చిన వాటిని విశ్లేషిస్తాయి, చిత్రాలనూ తయారు చేస్తాయి.

2. ఈ యాంటీనా 12 చదరపు మీటర్ల వైశాల్యం వుంటుంది. దీనిని మడతపెట్టి, అంతరిక్షంలోకి పంపుతారు. భూమిపై దాదాపు 20 కిలోమీటర్ల వైశాల్యంలోని ప్రదేశాలను చిత్రీకరిస్తుంది.

3. నైసార్ కి వున్న రెండు రాడార్లలో ఒకటి ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ, మరొకటి ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ. ఒకే ప్రదేశానికి సంబంధించిన చిత్రాలను వేర్వేరుగా తీసే సౌకర్యం వుంది.

4. ఈ రాడార్లు పగలు, రాత్రి అన్న తేడా లేకుండా మేఘాలు, పొగ, వర్షం, పొంగ మంచుల్లోనూ స్పష్టంగా ఫోటోలను ఇచ్చేస్తుంది.

5. ఈ ఉపగ్రమం రోజుకు 80 టీబీ డేటాను సృష్టిస్తుంది. ఈ డేటాను క్లౌడ్ లో భద్రపరిచి పంపిస్తారు.

6. నైసార్ రాడార్లు ప్రతి 12 రోజులకు రెండు సార్లు భూమి మొత్తాన్ని కవర్ చేసే సామర్థ్యం వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *