ఇలా రోజూ చేస్తే చాలు – 2

సూర్యడు ఉదయించడానికి ముందు, చంద్రుడు అస్తమించిన తరువాత, చంద్రుడు రావడానికి మధ్య కాలం సంధ్య కాలం అన్నారు. ఈ సమయంలో పరమేశ్వర ధ్యానం చేయమన్నారు. మనం మూడు ఋణాలతో పుడతాం. దేవ, పితృ, ఋషి ఋణం. హోమం చేయడంవల్ల ఈ ఋణం తీరుతుందన్నారు. హోమంవల్ల వర్షం, వర్షం వల్ల పంటలు పండి అందరికీ అన్నం లభిస్తుంది. తర్పణాలివ్వడంవల్ల పితృ, ఋషి ఋణం తీరుతుంది. చనిపోయిన తల్లిదండ్రులు ఏ రూపంలో ఉన్నా తర్పణం వసురుద్ర, ఆదిత్య పితృదేవతలు వారికి అందజేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి.

మంత్ర శక్తివల్ల ఇది సాధ్యమవుతుందని మత్స్య పురాణం చెబుతోంది. పితృదేవతలు అయుష్షు, సంతతి, ధనం, విద్య, సుఖం, స్వర్గం మోక్షం ఇస్తారని మార్కండేయ పురాణంలో చెప్పారు. కనుక మన పెద్దలను, పితరులను ఎప్పడూ మర్చిపోకూడదు. ప్రతి రోజూ వారి ఫోటోలకి ఒక పూవ్వు పెట్టి మనసులో ధ్యానించాలి. వారు చేసిన మంచి పనులు గుర్తు తెచ్చుకోవాలి. వారు చేసిన మార్గదర్శనం గుర్తు తెచ్చుకోవాలి. వాటిని అనుసరించాలి. యజ్ఞం గురించి మన ఉపనిషత్తుల్లో, స్మృతుల్లో చెప్పారు. ఒక సమిధను హోమం చేస్తే అది దేవ యజ్ఞం అనీ, నీటిని వదిలితే పితృ యజ్ఞమనీ అన్నారు. ఈ పనులన్నీ సామన్య హిందువు చేయగలిగినవే. యజ్ఞం అనగానే ఓ పెద్ద హోమగుండం, ఋత్వికులు, సమిధలు, మత్రోచ్ఛారణ కిలోల కొద్దీ నెయ్యి ` ఈ తరహ తంత్రం, మంత్రం ఉన్నా, వాటిని జరగనివ్వాలి. మనం చేయగలిన స్థాయిని అనుసరించి దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ యజ్ఞములను పాటించాలి. వీటిని పంచ మహా యజ్ఞాలన్నారు. వాటికి అంగబలం, అర్ధబలం, సంపత్తి అవసరం లేదు. తాను బ్రతకడం, ఇతరుల్ని బతికించడం, మరొకరికోసం బతకం అనే సూత్రంపై ఇవి ఆధారపడ్డాయి. ఇందులో భక్తి, కృతజ్ఞత, గౌరవం, దయ, సహనం మొదలైన ఉత్తమ గుణాలు కనిపిస్తాయి. కనుకనే గౌతమాది ఋషులు వీటిని మన 40 సంస్కారాలలో చేర్చారు. స్వార్థం నుండి మనిషిని దూరం చేసి త్యాగిగా తీర్చిదిద్దేవి ఈ యజ్ఞాలే. మన శరీరం వీటివల్ల బ్రహ్మ శరీరంగా మారుతుందట. వీటివల్ల గృహస్థు నిజమైన గృహస్థు అవుతాడు.

ఏ మహాశక్తి దయవల్ల మనం అన్నం తింటున్నామో ఆ మహాశక్తికి, పరమేశ్వరునికి నివేదించి మనం తినడమే దేవయజ్ఞం. ఆవుల్ని గోకడం, నిమరడం, గడ్డిపెట్టడం ఇవన్నీ భూతయజ్ఞంలో భాగం. ఒక గోవు పాలు కాని, పెరుగు కాని, నెయ్యి కాని సమస్త దేవ కార్యంలో, పితృదేవతలను పూజించే కర్మలలో కూడా వాడుతుంటాం. గోవు మూత్రం, పేడ వాడుతున్నాం. సమస్త రోగాలను పోగొట్టే శక్తి వాటికుంది అని ఆయుర్వేదం చెబుతోంది. అతిథి పూజ, అతిథి మర్యాదలు, పేరుతో అన్నం పెట్టడం ఇవన్నీ మనుష్య యజ్ఞం క్రిందకు వస్తాయి. వచ్చిన అతిథి ఏ మతంవాడని, ఏ కులమని అడిగి అన్నం పెడితే సత్ఫలితాన్ని పొందలేడని, పెట్టినా స్వర్గాన్ని చేరుకోలేడని విష్ణుపురాణం చెబుతోంది. మన దిన చర్యలో నిత్యమూ భగవంతుణ్ణి పూజించడం భాగం.

క్రైస్తవులు అదివారం, ముస్లింలు శుక్ర వారంలాగ మనకు లేదు. మనది నిత్య పూజ. పూజావిధానాలెన్ని ఉన్నా, సర్వసామాన్యంగా షోడోశోపచార పూజను మనం పాటిస్తుంటాం. సంకల్పం, ధ్యానం, అవాహన, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, పంచమృతస్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అలంకారం, పుష్పపూజ, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్ర పుష్పం, ఆత్మ ప్రదక్షిణ ఇలా 16 విధాలుగా పరమేశ్వరుని పూజిస్తాం. ఇవన్నీ ఒక సర్వ సాధారణ అతిథికి చేసే ఉపచారాలుగానే భావించి భగవంతుడికి కూడా చేస్తాం. ఆహారం శుచిగా ఉంటే మనస్సు శుచిగా ఉంటుంది. మనం తినే ఆహారానికి మనసుకు గట్టి సంబంధం ఉంది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనలో సాత్త్విక, రజో, తమో గుణాలు వస్తాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి తినడం మన సంప్రదాయం. భోజనంలో ఏముండాలో, ఎలా తినాలో, భోజనం తరువాత నియమాలు ఏమిటో మన శాస్త్రాలు వివరంగా చెప్పాయి.

  • హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *