ఇస్లామిక్, బ్రిటీష్ దండయాత్రల వల్లే విద్యా వ్యవస్థకు నష్టం : జగదీప్ ధన్కర్

ఇస్లామిక్ దండయాత్రలు, బ్రిటీష్ వలసవాదం వల్లే భారతీయ విద్యా వ్యవస్థకు తీవ్ర హాని కలిగిందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు.జ్ఞానం పుస్తకాలకే పరిమితం కాదు, అది సంప్రదాయాలు, సమాజాలు మరియు తరతరాలుగా సేకరించబడిన అనుభవాలలో కూడా ఉందన్నారు. JNU లో నిర్వహించిన ‘భారతీయ జ్ఞాన వ్యవస్థ’’ పై సెమినార్ జరిగింది.

ఈ సందర్భంగా ధన్కర్ మాట్లాడుతూ భారతీయ జ్ఞాన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి, పునరుద్ధరించడానికి గ్రంథాలతో పాటు అనుభవసారం కూడా అవసరమేనని, రెంటికీ సమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పరిశోధనా రంగంలో సందర్భం, సజీవ ఉదాహరణలే పరిపూర్ణతను చేకూరుస్తాయని,అలాగే ఆచరణాత్మక అనుభవం కూడా బలాన్నిస్తాయని తెలిపారు.

భారతీయ గ్రంథాలతో పాటు సంస్కృతం, తమిళం, పాళీ, ప్రాకృతం వంటి శాస్త్రీయ భాషలలో అందుబాటులో వున్న సాహిత్యాన్ని డిజిటలైజేషన్ చేయాలని, ఇది తక్షణ అవసరమని ఉప రాష్ట్రపతి నొక్కి చెప్పారు. ఈ డిజిటలైజేషన్ విద్యార్థులకు, పరిశోధకులకు, సమాజానికి అందుబాటులో వుండాలని కూడా సూచించారు. అలాగే తత్వశాస్త్రం, గణితం, మానవ శాస్త్రం, తులనాత్మక అధ్యయనాలు లాంటి అంశాలలో యువతకు బలమైన శిక్షణ అందించాలని పిలుపునిచ్చారు.

భారత దేశం మేధోపరమైన, సాంస్కృతితో నిలబడితేనే ప్రపంచంలో భారత్ శక్తిమంతంగా వుంటుందని, స్థిరంగా నిలబడుతుందని అభిప్రాయపడ్డారు. ఒక దేశం నిజమైన బలం, దాని ఆలోచన, వాస్తవికత దాని సంప్రదాయంలోనే వుంటుందన్నారు. మనకు సంప్రదాయంగా వస్తున్న ధ్యానం, తత్వశాస్త్రం లాంటి వాటిని వదిలేసి, మార్కుల ధోరణిలో పడిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.తక్షశిల, నలంద, విక్రమశిల వంటి పురాతన సంస్థలు భారత దేశానికే కాకుండా ప్రపంచానికే మేధోపరమైన ప్రేరణకు మూలంగా నిలిచాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *