అక్రమ వలసదారుల అంశం తీవ్రమైందే… ఆలోచించాలి : ధన్కర్
జనాభాలో మతపరమైన మార్పులు జాతీయవాదానికి తీవ్రమైన ముప్పుగా వాటిల్లుతోందని భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాయ్ పూర్ లోని NIT రాయపూర్, IIT భిలాయ్; IIM రాయపూర్ విద్యార్థులతో జరిగిన సెమినార్ లో ఆయన ప్రసంగించారు.ఆయా ప్రాంతాల్లో వుండే సహజమైన జనాభా పెరిగితే ఇబ్బంది వుండదు, అక్కడి పరిస్థితులకు దగ్గట్లుగా నడుచుకుంటారన్నారు.
కానీ అక్కడ అక్రమ వలసదారులు భారీగా వచ్చేసి, ఓ ప్రాంత జనాభా పెరిగితే.. అక్కడి ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని, ఇది ఆందోళన చెందాల్సిన అంశమన్నారు. మరోవైపు అక్రమ మత మార్పిళ్లు కూడా వున్నాయని, ఎవరు ఏ మతంలో వుండాలన్న స్వేచ్ఛ అందరికీ నిర్ణయించుకునే హక్కు వుందన్నారు. వివిధ ప్రలోభాలు, ఆకర్షణల ద్వారా మార్పిళ్లు చేస్తే జనాభాలో మార్పులు వస్తాయన్నారు.
మరోవైపు ఉమ్మడి పౌరస్మృతిపై కూడా మాట్లాడారు. ఇది రాజ్యాంగంలో వున్నదేనని అన్నారు. దీనిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందని, ఉత్తరాఖండ్ ఇదే మార్గంలో వుందని పేర్కొన్నారు. రాజ్యాంగంలో వున్న దానిని ఎలా వ్యతిరేకిస్తారు? అని వ్యతిరేకించే వారిని ప్రశ్నించారు.
మరోవైపు అక్రమ వలస దారులపై కూడా ధన్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.లక్షలాదిగా వున్న అక్రమ వలసదారులతో దేశం ఇబ్బందులు పడుతోందన్నారు. వారిని లెక్కించడమంటూ ప్రారంభిస్తే.. దిమ్మ తిరిగిపోయే అవకాశం వుందన్నారు. అధికారికంగా వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు.అక్రమ వలసదారు సమస్యతో హ్యాండిల్ చేయలేని రూపం దిద్దుకుందని, దీనిపై దృష్టిసారించాలని సూచించారు. ఇంత మంది అక్రమ వలసదారులతో ఏ దేశమూ ఇబ్బంది పడటం లేదని, అయితే.. వీరికి మద్దతిచ్చేవారు వారికి సులభంగా దొరికిపోతున్నారని పేర్కొన్నారు. వీరి వల్ల ఎన్నికల వ్యవస్థపై కూడా ప్రభావం పడుతోందన్నారు.
ప్రజలు ఎప్పుడూ దేశం గురించి ఆలోచించాలని, దేశానికే మొదటి స్థానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. తప్పుడు రాజకీయాలపై దృష్టి నిలపొద్దన్నారు. అక్రమ వలసదారుల సంఖ్యతో దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందన్నారు. అక్రమ వలసదారుల వల్ల మన దేశ వనరులను, ఉపాధిని, ఆరోగ్య రంగాన్ని, విద్యా రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు. దీనిపై దూర దృష్టితో ఆలోచిస్తూ… పరిష్కారం చూపాలని నొక్కి చెప్పారు.