అంకితభావం
జగద్విఖ్యాత శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ తండ్రికి తమ పిల్లలు ఆంగ్లభాషా స్కూల్లో చదవటం ఇష్టం లేదు. పిల్లలు మొదట మాతృభాష నేర్చుకోవాలని, మాతృభాషలో విద్యనభ్యసిస్తే చిన్నతనం నుంచి మన సంస్కృతీ, పరంపరలను అర్థం చేసుకుంటారని ఆయన భావించే వారు. జగదీశ్ చంద్రబోస్‌కు ఐ.సి.ఎస్ పరీక్ష పాసవ్వాలని ఉన్నా ఆయన తండ్రికి అది నచ్చలేదు. ‘నీ మీద వేరెవరూ ఆధిపత్యం చూపించరాదు. నీ మీద నీవే ఆధిపత్యం చూపించుకోవాలి, కాబట్టి సివిల్ సర్వీస్ పరీక్షకు వెళ్ళకు. అధ్యాపక వృత్తిని మాత్రమే చేపట్టు’ అని బోస్‌తో భగవాన్ చంద్రబోస్ చెప్పారు. జగదీష్ చంద్ర బోస్ మొక్కలకు ప్రాణముందని నిరూపించే క్రెస్కోగ్రాఫ్ రూపకల్పన, రేడియో తరంగాల (మిల్లీమీటరు విద్యుదయస్కాంత తరంగాలు) ఆవిష్కణతో శాస్త్రవేత్తగా పేరు గడిరచారు. తన ఆవిష్కరణలకు వ్యాపార లాభాలు పొందడం ఇష్టం లేక పేటెంట్ తీసుకోలేదు. వీరు ఆవిష్కరించిన రేడియో తరంగాలే మార్కోనీ రేడియో కనుగొనేందుకు మూలమయ్యాయి. అయితే, పక్షపాత ధోరణి గల ఆనాటి విదేశీ పాలకుల ఆధిపత్యం కారణంగా బోస్ కృషి ఆనాడు ప్రపంచానికి తెలియలేదు. ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసినప్పుడు అదే హోదాలో ఉన్న అక్కడి బ్రిటిష్ ప్రొఫెసర్లకంటే చాలా తక్కువ జీతం ఇవ్వజూపడాన్ని నిరసిస్తూ మూడేళ్ళు పైసా జీతం తీసుకోకుండా పనిచేశారు. చివరికి వీరి చిత్తశుద్ధి, అంకితభావాన్ని గుర్తించి గౌరవించారు.