పాక్ ఉగ్రవాదం విడిచిపెట్టేంత వరకూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత : జైశంకర్
పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఆపు చేసే వరకు సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. బుధవారం రాజ్యసభలో దీనిపై ఆయన మాట్లాడారు. నీరు, రక్ కలిసి ప్రవహించవని పునరుద్ఘాటించారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో వున్న వారు పాక్ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు.
సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం ద్వారా నెహ్రూ చేసిన తప్పిదాన్ని మోదీ ప్రభుత్వం సరిచేసిందన్నారు.’నెహ్రూ నేతృత్వంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దలేమని ఆరు దశాబ్దాలుగా చెబుతూ వచ్చారు. కానీ వాటిని మార్చవచ్చని మోదీ ప్రభుత్వం చేసి చూపించింది. ఆర్టికల్ 370ను రద్దు చేశాం. ఇప్పుడు సింధూ జలాల ఒప్పందాన్ని సరిదిద్దుతున్నాం’ అని జైశంకర్ చెప్పారు. అప్పటి నెహ్రూ ప్రపంచం శాంతి కోసం కాకుండా బుజ్జగింపు విధానాలతో సింధూ జలాల ఒప్పందంపై సంతకాలు చేశారని తప్పుపట్టారు.