హైదరాబాద్ నగరంలో వాన నీటి సంరక్షణ శూన్యం… ఇంకుడుగుంతల నిర్వహణ శూన్యం … సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌ నగరంలో వాననీటి సంరక్షణ విషయంలో చాలా అజాగ్రత్తగా వున్నట్లు జలమండలి సర్వేలో వెల్లడైంది. వాననీటి సంరక్షణకు చాలా ప్రాంతాల్లో సరైన జాగ్రత్తలు పాటించడం లేదని తేలింది. ఈ వేసవిలో ప్రధానంగా సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, నానక్‌రాంగూడ, మణికొండ ఇలా అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. అసలు ఫిబ్రవరి మాసాంతం నుంచే ఈ పరిస్థితి ఎదురైనట్లు ఈ సర్వేలో తేలింది. మే నాటికి నీటి సమస్య తీవ్రమైపోయిందని తెలిసింది. దీంతో చాలా ప్రాంతాలకు నీటి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. వేసవి ప్రారంభం నుంచి దాదాపు 5,6 లక్షల నీటి ట్యాంకర్లు పనిచేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అసలు నీటి వ్యవస్థ, వాననీటి సంరక్షణ నగరంలో ఎలా వుందని జల మండలితో పాటు దాదాపు 18 ఎన్జీఓలు సర్వే చేశాయి. ఏప్రిల్‌ మాసం నుంచి ఈ సర్వే కొనసాగింది.ఈ సర్వేలో ఇంకుడు గుంతలు, బోర్‌వెల్స్‌ పరిస్థితిపై సర్వే జరిగింది. చాలా ఇళ్లల్లో ఇంకుడు గుంతలు లేవని, దీని కారణంగా బోర్‌వెల్స్‌ ఎండిపోయినట్లు గుర్తించారు. అయితే.. వర్షపున నీటిని ఒడిసిపట్టి, భూమిలోకి ఇంకిస్తున్న ఇళ్లల్లో మాత్ర బోర్‌వెల్స్‌ బాగున్నట్లు తేలింది. మరికొన్ని ఇళ్లల్లో ఇంకుడు గుంతలు వున్నా… కేవలం పేరుకే వున్నాయని, నిర్వాహణ సరిగ్గా లేదని అధికారులు తెలిపారు.

జలమండలి ప్రకారం నగరంలో బోర్లు ఎండిపోయిన ఇళ్లు, అపార్ట్‌మెంట్ల విషయంలో 3,284 పరిసరాలను పరిశీఇంచారు. ఇందులో 773 ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో ఇంకుడుగుంతల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వున్నట్లు గుర్తించారు. ఆయా ఇళ్లల్లో 90 శాతం మేర అసలు బోర్లు పనేచేయడం లేదని జలమండలి గుర్తించింది. ఒక వేళ పనిచేస్తున్నా… అరగంట, గంటకు మించి ఆ బోర్లు ఉపయోగంలోకి రావడం లేదు. ఇక…. ఇంకుడు గుంతులు వున్నా…. చెత్తా చెదారంతో పూర్తిగా అస్తవ్యస్తమైపోయినట్లు తేలింది. నిజానికి వానా కాలానికి కొన్ని రోజుల ముందు వాటిని శుభ్రం చేయాలి. ఇసుక, గులక రాళ్లను పూర్తిగా తొలగించి, మళ్లీ కొత్తవాటితో నింపాలి. కానీ.. ఇవేవీ చేయడం లేదు. ఫలితంగా ఇంకుడు గుంతల వ్యవస్థ సరిగ్గా లేదని తేలింది. కొన్ని సంవత్సరాల క్రితం పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో పెద్ద సంఖ్యలో ఇంకుడు గుంతలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి నిర్వహణా సరిగ్గా లేదని తేలింది. ఒకవేళ అవి సరిగ్గా పనిచేసినా… భూగర్భ జలాలు కాస్త నిండేవని జలమండలి పేర్కొంది. దీంతో ఎన్జీవోలు, జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంకుడు గుంతలు లేని వారికి ఇంకుడు గుంతల ఆవశ్యకత చెబుతున్నారు. వచ్చే వేసవి నాటికి అయినా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

జలమండలి సర్వే ఎలా సాగిందంటే….

వేసవిలో ట్యాంకర్లపైనే ఆధారపడిన ఇళ్ల సంఖ్య : 38,000
సర్వే చేసిన ఇళ్లు : 4736
ఇంకుడు గుంతలు వున్న ఇళ్లు : 2884
ఇంకుడు గుంతలు లేని ఇళ్లు : 1852
బోర్‌వెల్స్‌ విషయంలో సర్వే చేసిన ఇళ్లు : 5067
పనిచేస్తున్న బోర్లు : 2746
పనిచేయనివి : 2321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *