జననాధుడు జగన్నాథుడు
పూరీ జగన్నాథుని రథయాత్ర తొమ్మిది రోజులపాటు వైభవంగా జరుగుతుంది. కుల, మత, ప్రాంత, వర్గ విభేదాలను మరచి దేశం నలుమూలల నుంచి భక్తులు రథయాత్రను తిలకించడానికి పూరీ చేరుకుంటారు. రథయాత్ర వైభవాన్ని కనులారా చూసేందుకు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడకి వస్తారు.
ఎప్పటికప్పుడు కొత్తగా తయారు చేసే రథాలతో సాగే ఈ ఉత్సవం అద్భుతం. పూరీ జగన్నాథ యాత్ర విశేషం ఏమిటంటే దేవాలయంలోని మూలవిరాట్ విగ్రహాలే రథ యాత్రలో ఉత్సవ విగ్రహాలవుతాయి. మిగిలిన దేవాలయాల్లో మూలవిరాట్ విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు వేరువేరుగా ఉంటాయి. అలాగే మూలవిరాట్ రాతి విగ్రహంలో, ఉత్సవ మూర్తి పంచలోహ విగ్రహరూపంలో విరాజిల్లు తుంటారు. కానీ పూరీలో ఈ రెండు రకాలుగా కాకుండా చెక్కతో చేసిన విగ్రహాలే మూల, ఉత్సవ విగ్రహాలుగా పూజలందుకుంటాయి.
రథోత్సవం అంటే సాక్షాత్తు భగవంతుడే భక్తుడి దగ్గరకు రావడం. జగన్నాధుడైన శ్రీకృష్ణుడు మరింత జన ప్రియుడు. ఆయన జీవితమంతా ప్రజలతోనే ముడిపడి ఉంది. అందుకనే జగన్నాధుడు జననాధుడయ్యాడు.
తొమ్మిది రోజులపాటు జరిగే జగన్నాథ రథయాత్ర ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు సాగుతుంది. జగన్నాధ, బలభద్ర, సుభద్ర రథాలను వేలాది మంది లాగుతారు. ప్రపంచంలోని ఏ ఆలయం లోనూ మూలవిరాట్ విగ్రహాలు ఇన్ని రోజులపాటు బయట పూజలందుకోవడం లేదు.
జగన్నాథ రథయాత్రలో ప్రతి ఏడూ లక్షలాది మంది పాల్గొంటారు. జాతి, కుల, భాషా, ప్రాంత, వర్గ భేదాలు లేకుండా అందరూ పాలుపంచుకునే భవ్యమైన కార్యక్రమం ఇది. భారతీయ సాంస్కృతిక ఏకత్వానికి అద్భుతమైన నిదర్శనం ఈ యాత్ర.