ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆస్తుల జప్తు
ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆస్తులను జమ్మూ కశ్మీర్ పోలీసులు జప్తు చేశారు. ఈ ముగ్గురు కూడా పీఓకే నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పూంచ్ జిల్లాలోని ఖస్బా, కిర్ని గ్రామాలలో వున్న 14.8 కెనాల్ భూమి, 28 లక్షల విలువైన ఆస్తులు జప్తయ్యాయి. నజాబ్ దిన్, మహ్మద్ లతీఫ్, మహ్మద్ బషీర్ అలియాస్ టిక్కా ఖాన్ అనే ఇస్లాం ఉగ్రవాదుల ఆస్తులు జప్తయ్యాయి. పూంచ్, పీఓకేతో పాటు జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లో వీరు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్నారు. శాంతికి భంగం కలిగిస్తూ, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారు.
చాలా రోజులుగా పీఓకే కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, అశాంతిని రేకెత్తిస్తున్నారని జమ్మూ కశ్మీర్ పోలీసులు పేర్కొన్నారు. వారి ఆస్తులను జప్తు చేయడం ద్వారా దేశ వ్యతిరేకులకు బలమైన సందేశం పంపుతున్నామని పోలీసులు ప్రకటించారు.
ఈ ఆస్తుల జప్తు కోర్టు ఆదేశాలను అనుసరించే జరిగింది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారిని ఏమాత్రం ఉపేక్షించమని, వారి ఆర్థిక మూలాలను ఇలాగే పెకిలించి వేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.