”పెట్టు రావిచెట్టు గంగరావి చెట్టు… దారంట యాపచెట్టు మరిగానుగ చెట్టు”.. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ పర్యావరణంలో పంచభూతాలను కాపాడుకోవడం మన బాధ్యత. ముఖ్యంగా వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందిపై ఎక్కువగా వుంది. మానవుడి అవసరాల నిమిత్తం అడవులను పూర్తిగా నరికేస్తున్నారు. చెట్లను కొట్టేస్తున్నారు. పోనీ… ఒకవేళ తమ అవసరాలకు చెట్లను నరికినా… వాటి స్థానే కొత్త మొక్కలను నాటడం విస్మరిస్తున్నారు. ప్రభుత్వాలు చెట్లను నాటడం కొత్త కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా… అవి పూర్తి స్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదు. చెట్టే మనిషికి ఆధారం.
ప్రముఖ తెలుగు రచయిత, సామాజికవేత్త, సినిమా రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు చెట్లు నాటడంపై పాట రాసి, పాడారు. మూర్తీభవించిన సామాజిక స్ఫూర్తి సద్గురు కందుకూరి శివానందమూర్తి గారి మార్గదర్శకత్వంలో నడుస్తున్న ఐఫోకస్ సంస్థ విజయోత్సవంలో, సద్గురు శివానందమూర్తి గారి ముందు ఆయన చెట్లు నాటడంపై పాట పాడారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా… ఆ పాట యథాతథంగా మీ కోసం….
‘‘పెట్టు రావిచెట్టు గంగరావి చెట్టు… దారంట యాపచెట్టు మరిగానుగ చెట్టు
వినరా గన్నేరు చెట్టు నేరేడు చెట్టు.. కోడిపుంజు పూలచెట్టు పొన్నాచెట్టు
ఇంట్లో మామిడి చెట్టు.. చెరువు గట్ల కొబ్బరిచెట్టు… పొలంగట్ల చింతచెట్టు.. పొలిమేరల మర్రిచెట్టు
పెట్టు రావిచెట్టు.. గంగరావి చెట్టు.. దారంత యాపచెట్టు మరిగానుగ చెట్టు
పెద్దపెద్ద రానీయదురా చెట్టు.. వానలనే కురిపించి.. వరదలనే అరికట్టు..
గాలిలో దుమ్ముధూళి ఆకులతో తుడిచిపెట్టు.. నీడనిచ్చి, పండ్లనిచ్చి ప్రాణాలనే నిలబెట్టు
ఎండవేడి తగ్గించి, ఎంతో హాయి తెచ్చిపెట్టు.. తరతరాల తనసర్వం లోకానికి పంచిపెట్టు
అందుకే చెట్టు నాటడంలో నువ్వు మనసు పెట్టు..
చెట్టు రావిచెట్టు గంగరావి చెట్టు.. దారంట యాపచెట్టు మరిగానుగ చెట్టు
నీ పుట్టిన రోజునా పెట్టు ఒక చెట్టు.. నీ పెళ్లి రోజునా పెట్టు మరో చెట్టు
పిల్లో పిల్లోడు పుడితే పెట్టు మరో చెట్టు.. ప్రమోషనొచ్చిందా పెట్టు మరోచెట్టు
ఇంక్రిమెంటు వచ్చిందా పెట్టు ఇంకో చెట్టు.. ఇల్లు కట్టుకున్నావా పెట్టు మరోచెట్టు..
ఇట్టాగే అందరిచేతా పెట్టించరా చెట్లు.. నీ జన్మే ధన్యమవుతది… జన్మభూమి మీదొట్టు..
పెట్టు రావిచెట్టు గంగ రావిచెట్టు.. దారంట యాపచెట్టు మరిగానుగ చెట్టు…”