వక్ఫ్ చట్టంలో సంస్కరణలు తేవడమే ప్రాథమి లక్ష్యం : రాజ్యసభలో జేపీ నడ్డా
తాము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వక్ఫ్ సవరణ బిల్లును తేవడం లేదని, జాతీయ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకొనే తెచ్చామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. తాను ఈ బిల్లుకు మద్దతిస్తున్నానని ప్రకటించారు. సభ కూడా మద్దతిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జేపీ నడ్డా పాల్గొన్నారు.
వక్ఫ్ చట్టంలో సంస్కరణలు తేవడమే ప్రాథమిక లక్ష్యమని, అలాగే వక్ఫ్ ఆస్తులు సరైన విధంగా నిర్వహణ జరిగేలా చూడడమని వివరించారు. అయితే.. ఈ బిల్లును అప్రతిష్ఠ పాలు చేయడానికి, వ్యతిరేకించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ తప్పుడు కథనాలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారని, ఢిల్లీలోని 123 ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారని నడ్డా పేర్కొన్నారు. ఇక కర్నాటకలో కూడా సరస్సులు, దేవాలయాలు, వ్యవసాయ భూములను, ప్రభుత్వ భూములను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించారన్నారు. తప్పులు జరిగాయని, వాటిని సవరించడానికే ఈ బిల్లు తెచ్చామన్నారు. ఈ సవరణలకు కాంగ్రెస్ కూడా సహకరించాలని ఆయన కోరారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, ఏ వర్గంపైనా వివక్ష లేకుండా కేంద్ర పథకాలను అందజేస్తున్నామని అన్నారు. అలాగే అన్ని వర్గాల వారూ వీటితో లాభం పొందుతున్నారని పేర్కొన్నారు.