”జంగిల్ రక్షా బంధన్” అంటూ ప్రకృతిని ఆరాధిస్తారు.. ఎక్కడో తెలుసా?
రక్షా బంధన్ అంటే అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లు రాఖీలు కట్టే సంప్రదాయమే మనకు ఠక్కున గుర్తొస్తుంది. అయితే.. ప్రకృతికి కూడా రక్ష కట్టే సంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో వుంది. నిజానికి ప్రకృతిని దైవీ స్వరూపంగా కొలిచే పద్ధతి మనకు వుంది. అమ్మ వారిని ప్రకృతి దైవీగా ఆరాధిస్తారు. ప్రస్తుతం పర్యావరణం అత్యంత ఇబ్బందుల్లో వుంది. ఈ నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకుందాం అంటూ చెట్లకు రక్ష కట్టడం వుంది. ఈ సంప్రదాయం ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో వుంది. అలాగే బిహార్ లో కూడా పాటిస్తారు. నిత్యం మనల్ని కాపాడే ప్రకృతిని సంరక్షించుకోవడం మన బాధ్యత అని, దానిని గుర్తు చేసుకుంటూ ఇలా రక్ష కడుతుంటారు. అక్కడి ప్రజలు తమ దగ్గర్లో వున్న అడవికి వెళ్లి, మహా వృక్షాలు, కొమ్మలు, కాండాలకు రక్ష కడుతుంటారు. దీనినే జంగిల్ రక్షా బంధన్ అని పిలుచుకుంటారు. 2004 నుంచి ఈ పద్ధతి ప్రారంభమైందని స్థానికుల మాట. పర్యావరణ పరిరక్షణ కోసం తాము ఇలా చేస్తామని, ఇతరులు కూడా దీనిని ఆచరించాలని ఇలా చేస్తామంటున్నారు.