‘హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తొలగించాలి’
ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో కంచి కామకోటి పీఠం 70వ అధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి త్రివేణీ సంగమం వద్ద భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేసారు. ఆ సందర్భంగా హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని తొలగించాలన్న డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు. దేవాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని సనాతన ధర్మ ప్రచారానికి మాత్రమే ఉపయోగించాలని ఆయన స్పష్టం చేసారు. ఆలయాల నిర్వహణకు ఆయన ప్రజలు-పురోహితులు-పూజారులు అన్న వ్యవస్థ నమూనాను ప్రతిపాదించారు.
దేవాలయాలను ప్రభుత్వం నుంచి విముక్తం చేయాలన్న డిమాండ్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. పలువురు ధార్మిక నాయకులు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఆ డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నారు. కంచి స్వామి కూడా దానికే అండగా నిలవడం ప్రాధాన్యం సంతరించు కుంది.
‘‘ప్రతీ కుంభమేళాలో ఒక డిమాండ్ ప్రస్తావనకు వస్తుంది. అది కాలక్రమంలో నెరవేరుతుంది. 2013లో రామమందిరం కోసం డిమాండ్ చేసారు. ఇప్పుడు 2025 మహా కుంభమేళాలో దేవాలయాల విముక్తి కోసం ఇచ్చిన పిలుపు దేశమంతటా ప్రతిధ్వనిస్తోంది’’ అన్నారు.
శ్రీ విజయేంద్ర సరస్వతి మూడు మౌలికమైన డిమాండ్లను ప్రధానంగా ప్రస్తావించారు. అవి:
(1) దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలనూ పునరుద్ధరించాలి.
(2) వాటిలో పూజా కార్యక్రమాలు, విహిత కర్మలు సక్రమంగా నిర్వహించాలి.
(3) దేవాలయాల రాబడి వాటివద్దనే ఉంచాలి, వేరే పనులకు దారి మళ్ళించకూడదు.
ఆలయాల రాబడిని సనాతన ధర్మ ప్రచారానికి, వేదవిద్య బోధనకు, గురుకులాల ఏర్పాటుకు, గోశాలల ద్వారా గో సంరక్షణకు, శాస్త్రీయ సంప్రదాయ కళలు-సంగీత ప్రచారానికీ ఉపయో గించాలని విజయేంద్ర సరస్వతి సూచించారు.
దేవాలయాలను ప్రభుత్వ హస్తాల నుంచి విముక్తం చేసాక వాటి నిర్వహణ ఎలా జరగాలన్న దానిగురించి కంచి మఠం శంకరాచార్యులు జయేంద్ర సరస్వతి స్వామి ఒక నమూనాను ప్రతిపాదించారు. దాని ప్రకారం ‘పిపిపి’ విధానంలో ప్రజలు-పురోహితులు-పూజారులు అనే మూడంచెల వ్యవస్థ ఉండాలి.
ప్రజలు (భక్తులు) : గుడి నిర్వహణలు ప్రజల భాగస్వామ్యం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం వస్తాయి.
పురోహితులు: వారు దేవాలయంలో పాటించవలసిన ఆచారాలు, సంప్రదాయాలను పర్యవేక్షించాలి.
పూజారులు: దేవాలయంలో రోజువారీ నిర్వహణ బాధ్యతలు వహించాలి. ఆలయ ఆస్తులను పరిరక్షించాలి.
ఈ ‘త్రివేణీ’ పద్ధతి సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. దేశంలోని ఆలయాల స్థితిగతులను మెరుగు పరుస్తుందని శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి భావన. ‘‘ప్రతీ పంచాయతీలోనూ ఒక పూజారి ఉండాలి, ప్రతీ గ్రామంలోనూ తిరుపతి గుడి లాంటి ఆలయం ఉండాలి’’ అని ఆయన సూచించారు.