కంచి పీఠంలో ‘‘శిష్య స్వీకార మహోత్సవం’’
కంచి కామకోటి పీఠంలో శిష్య స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. సనాతనధర్మ రక్షణ పరంపరను కొనసాగించడం కోసం భవిష్యత్ పీఠాధిపతికి సన్యాసదీక్ష ఇచ్చే ఈ ఉత్సవం చాలా ముఖ్యమైనది. అక్షయ తృతీయ పర్వదినం రోజున ప్రస్తుత పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు బ్రహ్మచారి అయిన శ్రీ దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్‌కి సన్యాస దీక్ష ఇచ్చి అనుగ్రహించారు.
‘‘సన్యస్తం మయ.. సన్యస్తం మయ.. అంటూ చేతులు పైకి లేపి… పంచభూతాలు, కామాక్షి అమ్మ, విజయేంద్ర సరస్వతుల సాక్షిగా సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రమాణం చెప్పారు. కోనేరు వద్ద వేద మంత్రాల మధ్య బ్రహ్మచారి సుబ్రహ్మణ్య గణేశ ద్రావిడ్ తన శిఖను త్యజించారు. తర్వాత చెవులకుండే పోగులను తీసేశారు. తదనంతరం సూర్యాభిముఖంగా వుండి యజ్ఞోపవీతాన్ని కూడా కోనేరులో త్యజించారు.
శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు బ్రహ్మచారికి సన్యాస దీక్ష వస్త్రాలు (కాషాయ వస్త్రాలు) ఇచ్చారు. ఈ సమయంలో ‘‘త్రాహిమాం సర్వ లోకేష.. వాసుదేవ సనాతన.. సన్యస్తమే జగద్యోనే.. పుండరీకాక్ష మోక్షదా… త్రాహిమాం పురుషోత్తమ’’ అన్న వేద మంత్రాలను పఠించారు. తర్వాత బ్రహ్మచారి సన్యాస దీక్ష వస్త్రాలు ధరించి, పూర్తి సన్యాసిగా మారిపోయారు.
శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వాముల కరకమలముల మీదుగా దండాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఉభయ గురుదేవులూ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు ఉత్తరాధికారికి ‘‘శ్రీ సత్య చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి’’ అన్న యోగపట్టాను అనుగ్రహించారు. తదనంతరం శంకర విజయేంద్రులు బాలస్వామికి మహా వాక్యాలను అనుగ్రహించారు. బాలస్వామి తలపై సాలగ్రామాన్ని ఉంచి, విజయేంద్ర సరస్వతీ మహా స్వామి వారు అభిషేకం చేశారు.
ఉభయ జగద్గురువులూ కంచిపీఠం అధిష్ఠాన దేవత అయిన కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకుని కంచి పీఠాధిపతుల అనుష్ఠానాలనూ దర్శనం చేసుకున్నారు. తదనంతరం వేద పఠనం, వివిధ దేవాలయాల నుంచి వచ్చిన పండితులు భిక్షా వందనం చేశారు.