అయోధ్యట్రస్ట్ సభ్యులు కామేశ్వర్ చౌపాల్ కన్నుమూత
అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు, రామ మందిర నిర్మాణ సమయంలో మొదటి ఇటుకను మోసిన కామేశ్వర్ చౌపాల్ (68) కన్ను మూశారు.కొద్ది రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స తీసుకుంటూ గురువారం కన్నుమూశారు. కామేశ్వర్ చౌపాల్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆయన కుమార్తె అతనికి కిడ్నీని దానం చేసింది. అయినా పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించలేదని వైద్యులు అన్నారు.
మరోవైపు ఈ మధ్యాహ్నం ఆయన భౌతిక కాయాన్ని చివరి చూపు కోసం బిహార్ కి తీసుకెళ్తారు. అక్కడి బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల కోసం వుంచుతారు. తర్వాత శాసన మండలికి కూడా తీసుకెళ్లి, కాసేపు వుంచుతారు.దీని తరువాత, సుపాల్‌లోని మురౌనా బ్లాక్‌లోని కమరైల్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.అయోధ్య రామాలయం అని చెప్పగానే కామేశ్వర్ చౌపాల్ ఠక్కుమని గుర్తుకొస్తారు. రామ మందిర నిర్మాణానికి మొదటి ఇటుక వేసింది వీరే. ఈయన పనితనాన్ని పరిగణనలోకి తీసుకొని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అతినికి ప్రథమ్ కరసేవక్ అని హోదా కూడా ఇచ్చింది.
రామ మందిరానికి శంకుస్థాపన జనవరి 22, 2024న జరిగింది, అయితే నవంబర్ 9, 1989న రామమందిర ఉద్యమంలో మొదటి శంకుస్థాపన చేసింది కామేశ్వర్ చౌపాల్. ఆ సమయంలో ఆయన విశ్వహిందూ పరిషత్ కార్యకర్త కూడా.నిజానికి రామమందిర ఉద్యమంలో కామేశ్వర్ చౌపాల్ కీలక పాత్ర పోషించారు. అతని ముఖ్యమైన పాత్రను పరిగణనలోకి తీసుకునే మొదటి ఇటుకను ఈయనతో పెట్టించారు.