ముస్లిం ప్రాంతాల్లో వుండే ఆలయాల పునరుద్ధరణకు నడుం కట్టిన మేయర్ ప్రమీలా పాండే

ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో వున్న హిందూ దేవాలయాలపై కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే కీలక నిర్ణయం తీసుకున్నారు. ముస్లిం ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి, నిరాదరణకు, ఆక్రమణలో వున్న దేవాలయాలనే పునరుద్ధరించాలని సంకల్పించారు. ఇలా 125 హిందూ దేవాలయాల పునరుద్ధరణకు నడుం బిగించారు. హిందువుల ధర్మానికి మూలస్తంభాలైన దేవాలయాలు చాలా రోజులుగా నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆమె పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం ముస్లిం ప్రాంతాలలో వున్న మందిరాలను కనుగొన్నామని, దీంతో రోజు వారీగా దీపారాధన, అర్చనలు జరిగేలా వాటిని పునరద్ధరించాలని నిర్ణయించినట్లు వివరించారు.

 

తాజాగా గుర్తించిన దేవాలయం బెర్రీ చౌరాహాలోని రాంజాంకీ దేవాలయం. ఒకప్పుడు ఈ దేవాలయం 2,400 చదరపు గజాల విస్తీర్ణంలో వుండేది. ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుందని మేయర్ తెలిపారు. ఈ దేవాలయాన్ని కాన్పూర్ హింసాకాండలో కీలక నిందితుడైన ముఖ్తార్ బాబా ఆక్రమించాడని మేయర్ వెల్లడించారు. ఇంతటి పవిత్ర దేవాలయాన్ని బిర్యానీలు వండడానికి ఉపయోగించారని తెలిపారు. రామ్ జానకీ మందిర్, రాధా కృష్ణ దేవాలయం, కోలోనెల్ గంజ్ లో వుండే శంకర దేవాలయాలను తిరిగి పునరుద్ధరించనున్నారు.

ముస్లిం ప్రాంతాల్లో నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలను పునరుద్ధరించాలన్న నిర్ణయంలో భాగంగా మేయర్ తమ బృందంతో కలిసి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కొన్ని సంఘటనల దృష్ట్యా మేయర్ ప్రమీలా పాండే తన తలకు హెల్మెట్ ధరించి మరీ దేవాలయాలను పర్యవేక్షిస్తున్నారు. ఆక్రమణలను పరిధిని కూడా అంచనా వేస్తున్నారు. ఆక్రమణలను తొలగించడానికి తక్షణ చర్యలు ప్రారంభించాలని కూడా అధికారులకు సూచనలు ఇస్తున్నారు.

బెకన్ గంజ్ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైన మూడు పురాతన దేవాలయాలను స్థానికుల సహకారంతో తిరిగి పునరుద్ధరించారు. మందిరాలను శుభ్రం చేసి, వాటి విగ్రహాలను కూడా శుభ్రం చేసి, ఆరాధన కోసం వాటిని సిద్ధంగా వుంచారు. కల్నల్ గంజ్ లో రెండు శివాలయాలున్నాయి. కల్నల్ గంజ్ కి దగ్గర్లోనే ఓ దేవాలయం వుంటే… 500 మీటర్ల దూరంలో మరో శివాలయం వుంది. దీనిని శతాబ్దం కింద లాహోరీ ఇటుకలతో నిర్మించారు. ఇప్పుడు ఇది శిథిలావస్థలో వుంది.కానీ.. దాని పరిసర ప్రాంతాలు ఆక్రమణలకు గురయ్యాయి. వాణిజ్య కేంద్రాలు వెలిశాయి. శివలింగం దాదాపుగా లేకుండానే పోయిందని చెప్పుకోవచ్చు. దేవాలయం ఆనవాళ్లు దాదాపుగా పోయాయి. దీనిపై కూడా మేయర్ దృష్టి సారించనున్నారు.

హెచ్చరికలు పంపిన మేయర్

దేవాలయాల విషయంలో ఎవ్వరు నిర్లక్ష్యం వహించినా, ఆక్రమణలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటానని మేయర్ ప్రకటించారు. ఆక్రమణ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా అధికారికంగా తెలిపారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఆక్రమణలు చేస్తే మాత్రం సహించమని హెచ్చరికలు పంపారు. ఇలాంటి మందిరాల్లో కొన్ని రోజుల్లోనే నిత్య అర్చనలు ప్రారంభమవుతాయని, ఆక్రమణలు తొలగించడానికి బుల్డోజర్ చర్యకు కూడా వెనకాడనని తేల్చి చెప్పారు. నగరానికి వున్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని తిరిగి సంపాదిస్తామని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *