నిలిచిన దేవాలయ నిర్మాణం.. మహిళల విరాళాలతో తిరిగి ప్రారంభం

కర్నాటక : గడగ్ జిల్లాలోని తిమ్మాపూర్ మహిళలు ఆదర్శంగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. దాదాపు 300 మంది ‘‘గృహలక్ష్మీ పథకం’’ లబ్ధిదారులు 17 లక్షలు సమీకరించి, రేణుకా ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి బహూకరించారు. దీంతో ఆలయ నిర్మాణం తిరిగి ప్రారంభమైంది.

ప్రభుత్వ నిధుల మీదనో, స్థానిక ప్రజా ప్రతినిధుల దయా దాక్షిణ్యాల మీదనో ఆధారపడకుండా వారే స్వయంగా ముందుకు వచ్చి, దేవాలయ నిర్మాణానికి పూనుకోవడం శుభపరిణామం. ఇంతటి చైతన్యం హైందవ సమాజంలో రావడం కూడా మంచిదే. ఇక.. ఈ మహిళలకు ఇలా చైతన్యపరిచింది సాధుసంతులే. ఇద్దరు సాధు సంతులు చేసిన విజ్ఞప్తి మేరకు మొత్తం 850 మంది మహిళలు ఒక నెల భత్యాన్ని విరాళంగా ప్రకటించారు.

హంపి తరహా ఆలయ ప్రాజెక్టుకు దాదాపు ₹1.1 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 70 శాతం మాత్రమే పూర్తైంది. నిధులు లేని కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ ఆలయ నిర్మాణంలో 10 మంది పనిచేస్తున్నారు. ఐదు నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు.

తిమ్మాపూర్ నివాసితులలో దాదాపు 80% మంది సవదత్తి ఎల్లమ్మ భక్తులని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం ట్రస్ట్ అధ్యక్షుడు రమణగౌడ దేశాయ్ తెలిపారు. నిజానికి ఓ చిన్న గద్దెపై రేణుకా ఎల్లమ్మ విగ్రహాన్ని పెట్టి పూజలు చేయడం ప్రారంభించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగి హనమప్ప హళ్లికేరి ఆరు గుంటల భూమిని, 1.25 లక్షలను విరాళంగా ఇచ్చారు. అయితే..70 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా 30 శాతం నిధులు లేక ఆగపోయింది. దీంతో కొట్టూరేశ్వర స్వామి, సొరతూరుకు చెందిన ఫకీరేశ్వర స్వామీజీ ముందుకు వచ్చారు. గృహలక్ష్మీ మహిళలు నిధులు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే పిలుపుతో మహిళలు ముందుకు వచ్చి, విరాళాలు ప్రకటించారు.

ప్రస్తుతం దేవాలయాలు ప్రభుత్వ పెత్తనంలో వున్నాయి. నిజానికి ముందు నుంచి కూడా హిందూ దేవాలయాలు సమాజ పోషితాలే. భక్తులే తమకు తోచిన నిధులు, దక్షిణలతో దేవాలయ వ్యవస్థను అతి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లేవారు. కానీ.. పరిస్థితులు మారిన తర్వాత కొంచెం ఇబ్బందుల్లో పడింది. కానీ.. తిమ్మాపూర్ మహిళలు విరాళాలు ఇచ్చి, దేవాలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడం ముదావహం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *