కార్తీక వైభవం

మన తెలుగు మాసాల్లో ప్రతి మాసానికి ఒక్కో విశేషత ఉంది. అయితే అన్నీ మాసాల్లోనూ కార్తీక మాసానిది ఓ విశిష్టశైలి. దీన్ని హరిహరులిద్దరికీ ప్రీతికరమైన మాసమని అంటారు. స్థితికారకుడు హరి, హరుడు శివుడు వీరిద్దరి ఆరాధన పద్థతి మనకు శుభాలిచ్చేదిగా ఉండాలని దానికి ప్రతీకగా కార్తీకమాసాన్ని చెబుతుంటారు. కార్తిక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్ర వచనం.

న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్‌,

‌న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్‌.

‌కార్తీక మాసమునకు సమానమైన మాసము, విష్ణుదేవునికంటే సమానమైన దేవుడు, వేదములకు సమానమైన శాస్తమ్రులు, గంగకంటే పుణ్య ప్రథములైన తీర్థములు లేవన్నది పురాణ వచనం.

 కార్తీక మాసంలో మహిళామణులందరూ దీప దానాలు, నదీస్నానాలతో పాటు కార్తీక పురాణం కూడా చదువుతుంటారు. ఈమాసం ముప్పై రోజులు ముప్పైకథల సమాహారమైన కార్తీక పురాణాన్ని పారాయణ చేయడం శుభకరం. ఈనెలరోజుల పాటు ఎలాంటి నియమాలను పాటించాలి. ఏ దేవతలను పూజించాలి? దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నీ ఈపురాణంలో ఉంటాయి.

ఈ నెలలో చెప్పుకోదగిన అంశం నియమిత భోజన నియమాలు. అసలే శరద్రుతువు. చలికాలం కావడం వల్ల ఎలాంటి ఆహారం పడితే దాన్ని తింటే జబ్బులకు గురికాక తప్పదు. అందుకే ఈ నెలలో తినవలిసిన, తినకూడని పదార్థాలను చెప్పారు మన పెద్దలు. అలాగే చెప్పుకోదగ్గ మరో ప్రధానమైన అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి కుదిరితే నదీ స్నానం లేకుంటే ఇంట్లోనే చన్నీటి స్నానం చేసి శుచిగా, పొడిబట్టలు ధరించి దీపారాధన చేస్తారు. దీనివల్ల మనసు, శరీరం రెండూ ఉత్తేజంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది.. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపు తాయి. ఈ మాసంలో మగువలంతా తమ ఇల్లలో దీపారాధన చేస్తారు.

కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. ఈ వేడుక ఏనాటినుండి ప్రారంభమైనదో చెప్పలేము. అనాదిగ ఈరోజున కనీసము ఒక దీపమైనా ఇంటింట వెలిగిస్తారు. ఈ దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకము ఒకటి ఉంది. ఆశ్లోకానికి అర్థము- ‘ఈ రోజున ఎవరీ దీపమున ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ, దీపదర్శనం చేస్తారో- ఈ దీపజ్యోతి ఎవరిమీద ప్రసరిస్తుందో వారు పాపముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందురుగాక!’- అని దానికి అర్థం. తాను కాలిపోతున్నా కూడా చుట్టూ ఉన్న చీకట్లను నశింపచేసి, తమ శక్తిమేరకు ఆ ప్రాంతాన్నంతటినీ వెలిగిస్తుంది దీపం. అలాగే ఇంటి ఇల్లాలు కూడా నిత్యం తాను అనేక ఒత్తిడిలతో ఉన్నా, తను ఇబ్బందిపడుతున్నా కూడా తమ కుటుంబము సమాజము బాగుండాలని కోరుకుంటూ ఆనందంగా తమ వంతు సహాయాన్నిఅందిస్తారు. వారు బాగు పడుతుంటే చూసి ఆనందిస్తారు. ఇల్లాలిని దీపంతో పోల్చడంలో అంతరార్థం ఇదే. ఇంటికి దీపం ఇల్లాలు అన్న నానుడి అందుకే వచ్చింది.

– లతా కమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *