శివకేశవుల మాసం కార్తికం

‘‘న కార్తిక సమో మాసః

న దేవం కేశవాత్పరం!

నచవేద సమం శాస్త్రం

న తీర్థం గంగాయాస్థమమ్‌’’

అని స్కంద పురాణం పేర్కొంది. అంటే ‘‘కార్తిక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు..’’ అని అర్ధం. దీపావళి మర్నాటి నుంచి చాలా మంది మగువలు నెల్లాళ్ల పాటు నియమ నిష్టలతో కార్తిక వ్రతాన్ని నిర్వహిస్తారు. కార్తికమాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. ప్రతి దినమూ పండుగ లాంటిదే…

ఈ నెలలో చెప్పుకోదగిన అంశం నియమిత భోజన నియమాలు. కార్తిక స్నానాలు, దీపారాధనలు.

కార్తికమాసం శివకేశవులిరువురికీ ప్రీతికరమైనది. అందుకే కార్తికమాసం నెల్లాళ్లూ ఉదయం, సాయంత్రం పూజామందిరంలో, తులసికోటలో దీపాలు వెలిగించి దీపానికి నమస్కరిస్తారు. కార్తిక మాసానికే దామోదరమాసం అని మరో పేరు. విష్ణువును ఈ మాసంలో కార్తీక దామోదరుడు అని పిలుస్తాం. ఈ మాసంలో చేసే సత్కర్మలన్నింటినీ కార్తిక దామోదర ప్రీత్యర్థం అనే సంకల్పం చెబుతూ చేస్తారు. ఇక ఈ మాసంలో కార్తిక శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు ఉన్న తిథులను పంచపర్వాలు అని పిలుస్తారు. మాసమంతా దీపాలు పెట్టడం వీలుకాని వారు ఈ ఐదు దినాలలో చేసినా నెలంతా చేసిన ఫలితం లభిస్తుంది. వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించినది కార్తిక పౌర్ణమినాడే. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన దినము కార్తికపౌర్ణమి. శివుడు త్రిపురాసురులను సంహరించింది పౌర్ణమినాడే.. అరుణాచలంలో మహాదీపాన్ని వెలిగించేది ఈ దినమునే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *