శివకేశవుల మాసం కార్తీకం

ఆధ్యాత్మికతతో పాటూ ఆరోగ్యం కూడా…

శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే

శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివః

అంటే అర్థం శివుడే విష్ణువు, విష్ణువే శివుడు… శివుడి అంతరంగంలో విష్ణువు ఉంటే, విష్ణువు అంతరంగంలో శివుడు ఉండాడని.. వారిరివురికీ బేధం లేదని చెప్పడమే. శివకేశవులిరివురికీ ప్రీతికర మైనది కార్తీకమాసం. దీపావళి తెల్లవారి నుంచి ఈ నెల ప్రారంభమవతుంది. ఈ నెల రోజుల పాటు చాలామంది మహిళామణులు కార్తీకమాస వ్రతాన్ని ఆచరిస్తారు. స్కంద పురాణంలో ఈ మాసం గురించి చెబుతూ ‘‘న కార్తీకే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సద్రసం శాస్త్రమ్‌.. ‌నతీర్థ గంగాయ సమం..’’ అని పేర్కొన్నారు. యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమాన మైనటువంటి నది లేనట్టే మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనదేదీ లేదని పెద్దల మాట. దీనిని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చంద్రుడు ఏ ఏ నక్షత్రాలలో సంచరిస్తూ ఉంటాడో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసనామాన్ని నిర్ణయిస్తాడు. చంద్రుడు కఈత్తికా నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం మూలాన ఈ మాసానికి కార్తీకం అని పేరు.

మహిళలు చేసే ఈ పూజలన్నింటినీ మనం చాదస్తాలుగా కొట్టిపడేస్తుంటాం. కానీ మన సనాతన భారతీయ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది. వాటి ఆచరణ వెనుక ఆధ్యాత్మికతతో పాటూ ఆరోగ్య రహస్యం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ కార్తీక మాసంలో చెప్పబడిన నియమాలు కూడా అలాంటివే… వాటివెనుక ఆధ్యాత్మికతతో పాటూ ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. కార్తీకమాసం పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్తీక స్నానాలే.

మన శరీరంలో నిత్యం ఎలక్ట్రో మాగ్నటిక్‌ ఆక్టివిటీ జరుగుతూ ఉండాలి. శరీరంలో ఎప్పటి కప్పుడు ఉష్ణశక్తిని బయటకు పంపించడమన్నమాట. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు బయటకి పంపిస్తేనే మనం ఉత్సా హంగా ఉండగలం. కార్తీకమాసంలో ఉదయంలేచి చేసే చన్నీటి స్నానం ముఖ్య ఉద్దేశం ఇదే.

ఈనెలలో చలి ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. చురుకుదనం తగ్గి బద్దకం పెరుగుతుంది. శరీరంలో నొప్పులు పెరుగుతాయి. వీటన్నింటికీ ఉపశమనమే కార్తీక స్నానాలు. ఉదయాన్నే లేచి స్నానం చేయడం, దైవపూజ చేయడం వల్ల సహజంగానే బద్దకం తొలిగి రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

 ఇక తర్వాత కార్తీక మాసంలో అతి ముఖ్యంగా చేసేపని దీపారాధన. మన మన భారతీయ సంప్ర దాయాలలో ఏ శుభ కార్యం మొదలు పెట్టాలన్నా దీపారాధనతోనే కార్యాన్ని ప్రారంభిస్తాం. దీపం పంచబ్రహ్మాత్మకం. కార్తీక దీపారాధనవల్ల సర్వపాపాలు హరింపబడి సద్గతి లభిస్తుందని, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. ఈమాసంలో వరి, గోధుమపిండితో చేసిన దీపాల్లో లేదా మట్టిప్రమిదల్లో ఆవునెయ్యిపోసి పైడి వత్తులతో అసంఖ్యాకంగా దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసంలో సువాసినులు ఆకాశదీపం వెలిగిస్తారు. కొంతమంది లక్ష్మీపూజ కూడా చేస్తారు. ఉసిరి చెట్టుకింద దీపారాధనచేస్తే విశేషఫలం పొందుతారని పురాణాలు చెబుతు న్నాయి. అయితే ఈ కార్తీకమాసంలో చేసే ఒక్కో దీపానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. దానివల్ల పుణ్యంతో పాటూ ఆరోగ్యాన్ని పొందగలం.

ఆవునెయ్యితో వెలిగించిన దీపకాంతిని చూస్తే గ్లూకోమా అనే కంటిజబ్బు రాదు. ఇక నువ్వుల నూనెతో వెలిగించిన దీపాన్ని కనీసం గంటపాటు చూడ గలిగితే శుక్లాలు రావు. దీపం వెలిగించడం వల్ల ఈ కిరణాలు మన కంట్లోకి ప్రసరించబడి కళ్లకు మేలు చేస్తాయి. గుండె జబ్బులు ఉణ్నవారు, ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేవారు రోజూ ఒక గంటపాటు ఈ దీపకాంతిని చూడగలిగితే వారిసమస్యలు తీరుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. కాబట్టి పెద్దలు చెప్పిన ఈ కార్తీకమాస విధివిధానాలను మీరూ ఆచరించి పుణ్యంతో పాటూ ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందండి.

– లతా కమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *