కర్తవ్య నిర్వహణకు కటిబద్ధులం కావాలి

ఈ ఆగస్ట్‌ 15 నాటికి భారత్‌ స్వతంత్రమై 75 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అమృత మహోత్సవాలు చాలా ముందే ప్రారంభ మయ్యాయి. ఇంకా సంవత్సర కాలం కొనసాగు తాయి కూడా. అంతమాత్రాన మన దేశంలో సమస్యలన్నీ తీరిపోయాయని కాదు. పాత సమస్యలు కొన్ని తీరితే కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి, వాటికితోడు మరికొన్ని కొత్త సమస్యలు కూడా వచ్చాయి. బానిసత్వం ఎక్కువ కాలం కొనసాగడంతో స్వాతంత్య్రం కోసం సంఘర్షణ కూడా చాలాకాలం సాగించాల్సి వచ్చింది.

ఆ ప్రయత్నాలన్నీ ఫలించి చివరికి 1947 ఆగస్ట్‌ 15న ఈ దేశాన్ని మనకు కావలసిన రీతిలో, మనకు ఇష్టమైన పద్దతిలో, మన ప్రజల ద్వారానే నడుపుకునే స్థితిని సాధించాం. బ్రిటిష్‌ పాలకులను పంపివేసి మన దేశపు పాలనా పగ్గాలను మనమే చేపట్టాము. ఈ సుదీర్ఘ పోరాటంలో తమ కఠోర పరిశ్రమ, త్యాగాల ద్వారా మనకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన వీరులను (అలాంటివారు ఈ విశాల దేశంలోని ప్రతి ప్రాంతంలో కనిపిస్తారు) గుర్తుచేసుకోవాలి.

విదేశీ పాలన ఎంత బాగున్నప్పటికీ దేశ ప్రజానీకపు ఆశలు, ఆకాంక్షలు నెరవేరవు. ‘స్వ’ అభివ్యక్తీకరణ స్వాతంత్య్ర సాధనకు ప్రేరణ అవుతుంది. వ్యక్తి స్వతంత్రజీవనంలోనే సురాజ్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. మరోవిధంగా అది సాధ్యం కాదు. వైశ్విక జీవనానికి ఏదో ఒకటి అందించడానికే ప్రతి దేశం ఆవిర్భవిస్తుందని స్వామి వివేకానంద అన్నారు. అలా ప్రపంచానికి ఏదైనా అందించాలంటే ఆ దేశం స్వతంత్రంగా ఉండాలి.

స్వాతంత్య్ర సాధన కోసం ప్రజలను జాగృతం చేసి, సాయుధ, అహింసా పోరాటాలలో పాల్గొని, స్వాతంత్య్రాన్ని సాధించడంతోపాటు దానిని కాపాడుకునేందుకు ప్రజలను సంసిద్ధం చేసినవారు ఆ లక్ష్యాన్ని గురించి వివిధ రకాలుగా వివరించారు. స్వర్గీయ శ్రీ రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ ‘చిత్త్‌ జేథా భయశూన్య ఉన్నత్‌ జతో శిర్‌’ అనే తన కవితలో స్వతంత్ర భారతాన్ని సాధించడానికి కావలసిన పరిస్థితులను వర్ణించారు. స్వాతంత్య్రం సిద్ధించి నప్పుడు భారత్‌ ఉదాత్త, ఉత్తమ, ఉన్నత దేశంగా అవతరిస్తుందని స్వాతంత్య్ర వీర సావర్కర్‌ ‘స్వతంత్రతా దేవి ఆరతి’ అనే తన కవితలో ఆకాంక్షించారు. తన ‘హింద్‌ స్వరాజ్‌’లో గాంధీజీ స్వతంత్ర భారతదేశపు కల్పనను వర్ణించారు. పార్లమెంట్‌లో రాజ్యాంగాన్ని మొదటిసారి ప్రవేశ పెడుతూ చేసిన రెండు ఉపన్యాసాల్లో స్వాతంత్య్ర ప్రయోజనం, దానిని సాధించడానికి మనం నిర్వర్తించవలసిన కర్తవ్యాలను డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ప్రస్తావించారు.

భారతీయ సనాతన దృష్టి, చింతన, సంస్కృతి, ఆచరణ ద్వారా ప్రపంచం ముందు సందేశాలను ఉంచింది. ప్రత్యక్ష అనుభూతి, వైజ్ఞానిక సత్యాలపై ఆధారపడిన సమగ్ర, ఏకాత్మ భావనలే వాటి ప్రత్యేకత. వివిధత్వం వేర్పాటువాదం కాకుండా ఏకాత్మవాదపు ప్రకటీకరణగా అవి పేర్కొన్నాయి. ఒకటిగా నిలవడానికి ఒకేవిధంగా ఉండాల్సిన అవసరం లేదు. అందరినీ ఒకేలా ఉండేట్లు చేయడం, తమ మూలాల నుండి వేరుచేయడంవల్ల ఘర్షణ ఏర్పడుతుంది. తమ తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూ, ఇతరుల ప్రత్యేకతలను గుర్తిస్తూ అందరూ కలిసి సాగినప్పుడే సంఘటిత సమాజం ఏర్పడుతుంది.

కాల ప్రవాహంలో సమాజంలో వచ్చిన జాతి, మత, భాషా, ప్రాంతీయత మొదలైన విభేదాలు, కీర్తి కాంక్ష, ధన కాంక్ష వంటి దోషాల వల్ల వచ్చే క్షుద్ర స్వార్థ ఆలోచనలను మనస్సు, మాట, కర్మల నుండి పూర్తిగా తొలగింఛాలి. ఇతరులకు మంచిని చెప్పడంతోపాటు మనం స్వయంగా ఆచరించడం చాలా అవసరం. సమతతో కూడిన, శోషణ లేని సమాజం వల్లనే మనం ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోగలం.

సమాజంలో అనేక అపోహలు కల్పిస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతూ, కలహాలను పెంచుతూ తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే, ద్వేషాన్ని వెళ్లగక్కే కుట్రపూరిత శక్తులు దేశంలోనూ, బయటనుంచి పనిచేస్తున్నాయి. సుసంఘటితమైన, సామర్ధ్యంతో కూడిన సమాజం మాత్రమే అటువంటి శక్తులకు ఏవిధమైన అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగగలుగుతుంది. సమాజంలో పరస్పర సంవాదం మళ్ళీ నెలకొల్పాలి.

ఇలా సమాజం మొత్తం యోగ్యమైన ధోరణిని, వ్యవహార శైలిని అవలంబించకుండా ఎలాంటి పరివర్తన సాధ్యపడదు. ‘స్వ’ ఆధారంగా ముందుకు సాగాలంటే ముందు ఆ ‘స్వ’ అంటే ఏమిటో స్పష్టమైన అవగాహన, జ్ఞానం, విశుద్ధమైన దేశభక్తి, వ్యక్తిగత, సామాజిక అనుశాసనం, ఏకాత్మ భావం అవసరం. అప్పుడే భౌతికమైన విషయ పరిజ్ఞానం, శక్తి సామర్ధ్యాలు, పాలనా యంత్రాంగం వంటివి ఉపయోగపడతాయి.

కాబట్టి స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా ఈ స్వాతంత్య్ర సాధనకు వెనుక ఉన్న పూర్వీకుల కఠోరమైన పరిశ్రమ గుర్తుకురావాలి. అటువంటి త్యాగం, పరిశ్రమలతో ‘స్వ’ఆధారితమైన, యుగానుకూల పాలన వ్యవస్థ నిర్మాణంతో భారత్‌ ను అన్ని రంగాల్లో వైభవోపేతమైన స్థితికి చేర్చాలి. రండి, సంఘటిత, సుహృద్భావ భావనతో ఆ తపోమార్గంలో ఉత్సాహపూర్వకంగా, మరింత వేగంగా ముందుకు సాగుదాం.

– డా. మోహన్‌ భాగవత్‌, సర్‌సంఘచాలక్‌, రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *