రాజకీయాలకు అతీతం భారతమాత : కేరళ గవర్నర్

భారత మాత విషయంలో అనవసర రాద్ధాంతాన్ని సీపీఎం సృష్టించిన నేపథ్యంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత మాత అంటే రాజకీయాలకు, సైద్ధాంతిక వైరుద్ధ్యాలకు అతీతమని అన్నారు. భారత మాత అన్న దానిని వివాదాస్పదం చేయవద్దని హితవు పలికారు.
ప్రధాని మోదీ నిర్వహించే మన్ కీ బాత్ పై నిర్వహించిన క్విజ్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి పంపిణీ కార్యక్రమంలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారతీయులందరూ ఒకే తల్లి సంతానం అంటూ ప్రతిజ్ఞ చేస్తామని గుర్తు చేశారు. భారత మాత అన్న ఆలోచన రాజకీయాలకు అతీతంగా వుండాలన్నారు. అలాంటి స్వచ్ఛమైన భావనను వివాదాస్పదంగా చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.
ఇక.. ఇదే కార్యక్రమంలో బీజేపీ అగ్రనేత మురళీధరన్ కూడా స్పందించారు. మన సొంత తల్లిని చర్చనీయాంశం చేస్తామా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఒకప్పుడు భారత్ మాతాకీ జై అని అనడానికి సంకోచించిన వారే ఇప్పుడ భారత్ మాతాకీ జై అంటున్నారన్నారు. ఇది స్వాగతించాల్సిన విషయమని అన్నారు.
కార్యక్రమాల్లో భారతమాత చిత్రాన్ని అనుమతించబోమంటూ కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం మరోసారి విద్వేషాన్ని వెళ్లగక్కింది. అలాంటి చిత్రానికి రాజ్యాంగం ద్వారాగానీ, భారత ప్రభుత్వం ద్వారాగానీ ఎలాంటి గుర్తింపు లేదంటూ వితండవాదం చేసింది. అందుకే పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో భారతమాత చిత్రం వినియోగించడాన్ని అంగీకరించలేదని పేర్కొంది. ఆ చిత్రం పెట్టినందుకు నిరసనగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి పి.ప్రసాద్‌ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించడం గమనార్హం.
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు అధికారిక కార్యక్రమాలను రాజకీయ సమావేశాలుగా మార్చకూడదని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడింది. రాజ్‌భవన్‌ కార్యక్రమంలో భారతమాత చేతిలో జాతీయ జెండా బదులు పార్టీ జెండా ఉందని, అందువల్ల అలాంటి చిత్రాలను అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగించకూడదంటూ తన పెడ ఆలోచనను సమర్థించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *