ఓనం పండగ సందర్భంగా కేరళలో ప్రత్యేక ఆర్గానిక్ స్టాల్స్.. సేంద్రీయ ఉత్పత్తులకు భారీ డిమాండ్
కేరళలో అత్యంత ప్రధానమైన పండుగలలో ఓనం పండుగ. సద్య అని కూడా పిలుస్తారు. ఈ పండగకి విందుకి దగ్గర సంబంధం వుంటుంది. కుటుంబాలన్నీ కలిసి షడ్రషోపేతమైన విందును సిద్ధం చేసి, ఆరగిస్తారు. ప్రజల మధ్య ఐకమత్యాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా వ్యవసాయంతో కూడా ఈ పండగకి అనుబంధం వుంటుంది. అయితే.. వ్యవసాయంలో హానికరమైన క్రిమి సంహారకాలు బాగా వాడుతుండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పంట భూమిలో కూడా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రజలు, రైతులు మెళ్లిగా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. దీంతో ఆరోగ్యానికి ఇబ్బందులుండవని అందరూ దీని వైపే మళ్లుతున్నారు.
ఓనం పండగకి, ఆహారానికి, వ్యవసాయానికి సంబంధం వుండటంతో కేరళ ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు సేంద్రీయ ఉత్పత్తులకు కూడా మంచి మార్కెట్ కల్పించాలని నిర్ణయించింది. అయితే సేంద్రీయ ఉత్పత్తులకు అధిక ధర వుండటంతో ప్రజలు కాస్త వెనక్కి వెళ్తున్నారని కేరళ ప్రభుత్వం గుర్తించింది. దీంతో మంచి ఐడియాతో ముందుకు వచ్చింది.
ఓనం పండగ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ప్రత్యేక మార్కెట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. ఓనం పండగ సందర్భంగా ప్రజలకు అత్యంత సరసమైన ధరల్లోనే సేంద్రీయ కూరగాయలు, సేంద్రీయ పంటలు లభించేలా ముందుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి తిరువనంతపురంలో ఈ సేంద్రీయ దుకాణాలను కేరళ ప్రభుత్వం భారీ సంఖ్యలో పెట్టింది. కుటుంబ శ్రీ, వ్యవసాయ సంస్థల నేతృత్వంలో ఈ స్టాల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. మూడు రోజుల పాటు ఈ స్టాల్స్ ప్రజలకి అందుబాటులో వుంటాయి. డిమాండ్ బాగా వున్న ప్రాంతాల్లో మరిన్ని రోజులు ఈ స్టాల్స్ తెరిచి వుంచుతామని అధికారులు ప్రకటించారు. సేంద్రీయ రైతుల నుంచి కూరగాయలను నేరుగా సేకరించి, ఈ స్టాల్స్ కి తెస్తున్నారు. దీంతో ప్రజలు కూడా కొనగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.
ఓనం పండగ సందర్భంగా మామూలు కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో వాటికి ప్రత్యామ్నాయంగా ఈ సేంద్రీయ కూరగాయల స్టాల్స్ ఉపయోగపడుతున్నాయి. దీంతో ప్రజలకు కూడా కూరగాయలు సరసమైన ధరల్లోనే అందుబాటులో వుంటున్నాయి. మరోవైపు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అత్యంత శుచికరమైన, క్రిమి సంహారక మందులు లేకుండా పండగ జరుపుకోవచ్చని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.