కుల గణన విషయంలో సంఘ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : కేరళ ముస్లిం కాన్ఫరెన్స్

కుల గణన అమలు విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ ముస్లిం కాన్ఫరెన్స్ స్వాగతించింది. కుల గణన విషయంలో ఆరెస్సెస్ తీసుకున్న వైఖరిని తాము స్వాగతిస్తున్నామని ఆ సంస్థ కన్వీనర్ ఏకే సుల్తాన్ ప్రకటించారు. కేంద్రంపై సంఘ్ ఒత్తిడి తెచ్చి, కుల గణన చిత్తశుద్ధితో అమలయ్యేలా చూడాలని అన్నారు. పాలక్కడ్ లో కేరళ ముస్లిం కాన్ఫరెన్స్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాళ్లు పై వ్యాఖ్యలు చేశారు. ఇక.. రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగపరమైన హక్కు అని, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి అభివృద్ధి పథానికి చేరుకోవడానికి రిజర్వేషన్లు ఓ మద్దతుగా నిలుస్తాయని తెలిపారు. రిజర్వేషన్లను తిరస్కరించడం అంటే రాజ్యాంగ ఉల్లంఘనే అని సంస్థ పేర్కొంది.
కేరళలోని పాలక్కాడ్‌లో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సమన్వయ సమావేశం సందర్భంగా కులగణన అంశం ప్రస్తావనకు వచ్చింది. నిర్దిష్ట సమూహాలు లేదా కులాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే, ఆ సమాచారాన్ని వారి సంక్షేమం కోసమే ఉపయోగించాలని, ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయమై ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కులగణనను “సున్నితమైన అంశం”గా పేర్కొన్నారు. “హిందూ సమాజానికి కులం, కుల సంబంధాలు సున్నితమైన అంశాలు. మన జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఇది ముఖ్యమైన అంశం. కాబట్టి రాజకీయాల ప్రాతిపదికన లేదా ఎన్నికల ప్రయోజనాలకోసం కాకుండా చాలా సున్నితంగా వ్యవహరించాలి” అని ఆయన సూచించారు.
“ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లుగా, అవును, ఖచ్చితంగా అన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం, వెనుకబడిన నిర్దిష్ట సమూహం లేదా కులాన్ని ఉద్దేశపూర్వకంగా దృష్టి సారించడం, కొన్ని వర్గాలు, కులాలపై ప్రత్యేక శ్రద్ధ అనేవి అవసరం. కాబట్టి, అందుకోసం, ప్రభుత్వానికి సంఖ్యలు అవసరం. ఆ మేరకు తీసుకోవచ్చు. ఇదివరలో తీసుకున్నారు కూడా” సునీల్ అంబేకర్ తెలిపారు. “అయితే అది ఆ వర్గాలు , కులాల సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. దీనిని ఎన్నికల ప్రచారానికి రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదు. కాబట్టి మేము ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక లైన్‌తో ఉంచాము” అని అంబేకర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *