ఖలిస్తానీ ఉగ్రవాదం – నేపథ్యమిదీ
ప్రాచీన భారతదేశంలో పంజాబ్ ప్రాంతం చాలా ముఖ్యమైనది. ఈ ప్రాంతాన్ని ‘‘సప్తసింధు’’ ప్రాంతంగా పిలిచేవారు. దాని అర్థం ‘‘ఏడు నదుల ప్రాంతం’’. ఈ ప్రాంతం హిందూ మహాసాగరం (ఇప్పటి అరేబియా సముద్రం), గంగ-యమునా పరీవాహక ప్రాంతం, ఆఫ్ఘని స్తాన్‌లోని కాందహార్ వరకు విస్తరించి ఉండేది.15వ శతాబ్దంలో గురు నానక్ దేవ్ సిక్కు మతం స్థాపించిన తరువాత ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు సిక్కులుగా పిలవబడ్డారు. మహారాజా రంజిత్ సింగ్ పాలనలో సిక్కు సామ్రాజ్యం అత్యంత శక్తివంతంగా రూపొందడంతో పాటుగా అతని పాలనలో పంజాబ్ ప్రాంతం శాంతి, సామరస్యాలతో విలసిల్లింది. సిక్కుల దేశభక్తి, దేశం పట్ల మాతృభావనా అచంచలమైనది.
ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న సిక్కు సమాజం కొందరు దారి తప్పిన దేశద్రోహుల కారణంగా చెడ్డ పేరును కూడగట్టుకోవడం అత్యంత విచార కరం. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కొన్ని జాతీయ అంతర్జాతీయ సంఘటనలను పరిశీలించి నట్లయితే ఈ విషయం స్పష్టం అవుతుంది. కెనడా కేంద్రంగా ఖలిస్తానీ ఉగ్ర వాదులు చేస్తున్న భారత వ్యతిరేక తీవ్రవాద కార్య కలాపాలు సామాన్య ప్రజలలో భయాందోళనలను రేకిత్తిస్తున్నాయి. దీనిలో భాగంగా కెనడా భారత రాయబారులను తమ దేశం నుండి బహిష్కరించడం, దానికి ప్రతిగా భారత్‌లోని కెనడా రాయబారులను బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి.
ఖలిస్తాని ఉగ్రవాదం ప్రధానంగా భారత దేశంలోని పంజాబ్ ప్రాంతంలో పుట్టిన ఒక వేర్పాటు వాద ఉద్యమం. ఖలిస్తాన్ పేరిట సిక్కుల కోసం ఒక ప్రత్యేక దేశం సృష్టించాలనే లక్ష్యంతో కొన్ని ఉగ్రవాద ముఠాలు, కొన్ని రాజకీయ సంస్థలు ఈ వేర్పాటువాద ఉద్యమంలో పాల్గొన్నాయి. ఈ ఉద్యమం 1980వ దశకంలో అత్యంత క్రియా శీలకంగా సాగి పంజాబ్ ప్రాంతంలో తీవ్ర హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. ఖలిస్తానీ ఉద్యమం పుట్టుకకు ప్రధాన కారణం 1947లో భారతదేశ విభజన. విభజన సమయంలో పంజాబ్ రాష్ట్రంలో హిందూ, సిక్కు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను భారతదేశంలో కలిపారు. అయితే, కొంతమంది దారి తప్పిన సిక్కు నాయకులు తమకు ప్రత్యేక దేశం అవసరమని భావించారు.
1970లలో ‘అకాళీదళ్’ వంటి సిక్కు వర్గాలు ప్రత్యేక పంజాబ్ రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టిన ప్పటికీ 1980లలో ‘జర్నైల్ సింగ్ భింద్రన్ వాలే’ నాయకత్వంలో ఈ ఉద్యమం తీవ్రవాదం దిశగా మళ్లింది. భింద్రన్‌వాలే నాయకత్వంలో పంజాబ్‌లో సిక్కు ప్రజల కోసం ప్రత్యేక ఖలిస్థాన్ కోసం ఉద్యమం హింసాత్మక మార్గాన్ని ఎంచుకుంది. దీనితోే 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూస్టార్’లో అమృత్ సర్‌లోని ‘గోల్డెన్ టెంపుల్’లో భింద్రన్‌వాలే, అతని అనుచరులను భారత సైన్యం తుద ముట్టించింది.
తదుపరి కాలంలో భారత ప్రభుత్వం తీసుకున్న కొన్ని కఠినమైన నిర్ణయాల కారణంగా ఈ సమస్య కొంతకాలం సద్దుమణిగినట్లుగానే కనిపించింది. కాని ఈ ఖలిస్తానీ ఉగ్రవాదం వేర్లు భారత్‌లో కాక విదేశాల్లో ఉండటం గమనార్హం. మన పొరుగు దేశం పాకిస్తాన్ తన గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ ద్వారా ఖలిస్తానీ ఉగ్ర వాదులకు కావలసిన ఆయుధాలు సమకూర్చడం, కీలకమైన సమా చారాన్ని పంచుకోవడం, మాదకద్రవ్యాలను యువతకు చేరవేయడం లాంటి విషయాల్లో ఐఎస్‌ఐ పాత్రను మన భద్రత దళాలు అనేకసార్లు నిగ్గు తేల్చాయి. అయితే పాకిస్తాన్‌తో పాటు కెనడా కూడా ఖలిస్తానీ ఉగ్రవాదులకు తన సహాయ సహకారాలు అందించడం, బహిరంగంగా మన దేశంలో ఉగ్రవాద, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి తమ మద్దతు కొనసాగించడం అత్యంత అక్షేపణీయం.
దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి పెనుసవాలుగా మారిన ఖలిస్తాని ఉద్యమాన్ని విజ్ఞతతో పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో కెనడా దాని సమర్ధకుల దమననీతిని అంతర్జాతీయ వేదికలు మీద ఎండగట్టడం ద్వారా అంతర్జాతీయ సమాజంను జాగృతం చేయాలి. ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యాని ఎదుర్కొనేందుకు అమెరికా తాలిబాన్‌ని సృష్టించింది. కాలక్రమంలో అదే తాలిబాన్ అమెరికాని చావు దెబ్బ తీసిన విషయం విదితమే. ఈ సంఘటన నుండి కెనడా కూడా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్లయితే తను పెంచి పోషించిన ఖలిస్తానీ ఉగ్రవాదులు ఏదో ఒక రోజు ఆదేశ సార్వభౌమాధి కారానికి పెను సవాలుగా మారడం తథ్యం.