గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం కలిగిస్తున్న “కిసాన్ చాచి”

అనేక దశాబ్దాలుగా, గ్రామీణ భారతదేశంలోని చాలా ప్రాంతాలలో మహిళలు పరిమిత జీవితాన్ని గడుపుతున్నారు. నేటికీ, దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో మహిళలు స్వతంత్ర జీవితాన్ని గడపలేకపోతున్నారు. ఈ సందర్భంలో బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా, సరేయా గ్రామానికి చెందిన 73 ఏళ్ల రాజకుమారీ దేవి, వీటన్నింటినీ అధిగమించింది. 73 ఏళ్ల వయసులో కూడా నిత్యం ఉత్సాహంగా సైకిల్ పై తిరుగుతూ ప్రయానిస్తూ కనిపిస్తుంది ఆమె. ఈ వయసులో కూడా అలసట అంటూ లేకుండా గత 20 సంవత్సరాలుగా సైకిల్ పైనే ప్రయాణిస్తూ సమీప గ్రామాలకు చేరుకుంటున్నారు. ఎందుకు అలా ఈ వయసులో కూడా కష్టపడుతూ గ్రామాలకు సైకిల్ పై వెళుతుంది అనుకుంటున్నారా…గ్రామీణ మహిళలకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి వ్యాపారంగా ఊరగాయలు పెట్టడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు రాజకుమారీ దేవి. తన నిస్వార్థ సేవతో ఎంతో మంది మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగడానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అందుకే ఆమెను అందరూ ముద్దుగా కిసాన్ చాచి అని పేరుపెట్టి పిలుస్తారు.

వ్యవసాయ రంగంలో, మహిళా సాధికారతలో రాజకుమారి దేవి అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా పలు జాతీయ స్థాయి పురస్కారాలు ఆమెను వరించాయి. 2007లోనే ఆమెకు ‘కిసాన్ శ్రీ’ అవార్డు లభించింది. ఆ తర్వాత, 2019లో దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారం ఆమెను వరించింది. ఈ అవార్డులు ఆమె కృషికి, లక్ష్యం పట్ల ఆమెకున్న అంకితభావానికి దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. ఆమె మార్గదర్శకత్వంలో, దాదాపు 300 మంది మహిళలు స్వర్ణ జయంతి రోజ్‌గార్ యోజన కింద స్వయం సహాయక బృందాలను (SHG) ఏర్పాటు అయ్యాయి .

ఆమె అందించిన మార్గదర్శకత్వంతో ఎంతో మంది మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా, తమ కుటుంబాలకు అండగా నిలిచే శక్తిమంతమైన ఆర్థిక వనరులుగా మారారు..

ఈ విధంగా, రాజకుమారి దేవి తన సైకిల్ ప్రయాణం ద్వారా గ్రామీణ మహిళల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఆమె సేవ కేవలం వ్యవసాయ పరిజ్ఞానాన్ని పంచడం వరకే పరిమితం కాలేదు, గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించడంలో, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. 73 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా సమాజసేవలో భాగస్వామ్యం అవుతూ, మహిళల స్వావలంబనకోసం పడుతున్న తపన,అంకితభావం అనేవి నేటి తరానికి ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *