ఏకంగా అడవినే దత్తత తీసుకున్నాడు.. ప్రతిరోజూ అడవి స్వచ్ఛత కోసం పరితపిస్తాడు

కొమెర అంకారావు… ముద్దు పేరు జాజి. కేవలం పర్యావరణ ప్రేమికుడే కాదు. అటవీ ప్రేమికుడు. ప్రతి రోజూ అడవిని కాపాలా కాస్తూనే వుంటాడు. మన శరీరానికి ఏ చిన్న దెబ్బ తగిలినా… అప్పటికప్పుడు వైద్యుడ్ని సంప్రదించి, ఎలా నయం చేసుకుంటామో… అచ్చు అలాగే… అడవిలో ఏ చిన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనిపించినా, చెట్లు పెరగడంలో ఏమైనా ఇబ్బందులు వుంటే.. వెంటనే సరిచేసేస్తాడు. అడవిలో ప్లాస్టిక్‌ వ్యర్థం కనిపిస్తే వెంటనే తొలగిస్తాడు. అటవీ స్వచ్ఛతను ఎప్పటికప్పుడు కాపాడుతూనే వుంటాడు. ఎవ్వరు వెంట రాకపోయినా… సరే.. ఒక్కడే నల్లమల అటవీ పరిధిలో అడవిని కాపాడే ఉద్యమం చేపట్టాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అడవిని దత్తత తీసుకున్నాడు. ప్రతి రోజూ నల్లమల అటవీ ప్రాంతంలో ఏదో ఒక చోట తిరుగుతూనే వుంటాడు. ఈయన పల్నాడు జిల్లాలోని కారంపూడి.

చిన్న తనం నుంచే రోజూ తన ఊరుకి సమీపంలో వుండే అడవికి వెళ్లి , అక్కడి నుంచి అడవిలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ వన్య ప్రాణాలను ఎవ్వరూ వేటాడకుండా కాపలా వుంటాడు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరివేస్తాడు. తానున్న సమయంలో ఎవ్వరూ ప్లాస్టిక్‌ వ్యర్థాలు అడవిలో డంప్‌ చేయకుండా చూస్తాడు. ఒకవేళ ఎవరైనా వన్య ప్రాణులను వేటాడినా… ప్లాస్టిక్‌ను పాడేసినా… కోపం చేయకుండా… వారికి అడవీ ప్రాముఖ్యతను వివరిస్తూ.. వ్యక్తుల్లో మార్పు తెచ్చే పద్ధతిలో వుంటారు. అడవిలో వుండే ప్లాస్టిక్‌, పాలిథీన్‌, డిస్పోజబుల్‌ గ్లాసులను ఎప్పటికప్పుడు ఏరివేస్తూ… తనతో వుండే సంచీలో వాటిని జాగ్రత్తగా వేసుకొని, అటవీ ప్రాంతం బయటికి తెచ్చి, పారేస్తారు.కొన్ని సంవత్సరాలుగా ఈయనొక్కడే ఈ పనిని ఉద్యమంలా చేస్తున్నారు. ఇలా దాదాపు వందల ఎకరాల అడవిని శుభ్రం చేశాడు. ఇంకా చేస్తూనే వున్నాడు.

అలాగే.. ఆయా కాలాలను బట్టి కూడా అడవిలో పనిచేస్తుంటాడు. ఉదాహరణకు వేసవిలో చెట్లు కాలిపోవడం సహజం. కానీ… వెంటనే ఆ కార్చిచ్చును ఆపేస్తుంటాడు. అడవిలో వుండే మూగ జీవాలను ఆ సమయంలో కాపాడతాడు. వాటి అవసరాలను తీరుస్తుంటాడు. ఇక.. వర్షాకాలంలో మొక్కలు నాటడం ఓ పెద్ద ఉద్యమంలాగానే తీసుకున్నాడు. ప్రతి వర్షాకాలంలో మొక్కలు నాటుతాడు. వాటిని సంరక్షిస్తాడు కూడా. అరుదైన ఔషధ మొక్కలను గుర్తించడం, వాటిని కాపాడటం చేస్తుంటాడు. అలాగే వర్షాకాలంలో సీడ్‌ బాల్స్‌ను తయారు చేసి, లక్ష సీడ్‌ బాల్స్‌ను అడవిలో చల్లే కార్యక్రమం కూడా చేస్తాడు.

6000 పాఠశాలలు తిరిగి.. ప్రకృతి పాఠాల బోధన

అంకా రావు తన ప్రకృతి ఉద్యమం, అటవీ ఉద్యమంలో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేస్తారు. ప్రతి రోజూ ఏదో ఒక పాఠశాలను సందర్శిస్తూ… విద్యార్థులకు ప్రకృతి పాఠాలు బోధిస్తుంటారు. వారిలో ప్రకృతిపై ప్రేమని, అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యతను బోధిస్తుంటారు. ఇప్పటి వరకు 6000 పాఠశాలలు తిరిగి, ప్రకృతి పాఠాలు బోధించి, విద్యార్థులలో చైతన్యం తీసుకొచ్చారు. అలాగే ప్రతి వర్షాకాలంలో కూడా విద్యార్థులతో ‘‘సీడ్‌ బాల్స్‌’’ తయారు చేయిస్తారు. అడవికి తీసుకెళ్లి, వారితోనే చల్లిస్తారు. అంతేకాకుండా ప్రకృతి కోసం పుస్తకాలు కూడా రచించి, విద్యార్థులకు పంచిపెడుతుంటారు. అంకారావు అడవిపై చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమను చూసి.. అడవీ అధికారులు తెగ ముచ్చటపడిపోతుంటారు. చాలా సార్లు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి, సత్కారం కూడా చేశారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అడవిని కాపాడుతున్నారని, తమకంటే ఎక్కువ సేవ చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *