కృష్ణం వందే జగద్గురుమ్
– హనుమత్‌ప్రసాద్
భారతీయ పరంపరలో గురువుకు ప్రముఖమైన స్థానమున్నది. గురువుకు ఎన్ని నిర్వచనములున్నా, గురువును వర్ణించేందుకు ఎన్ని శ్లోకాలున్నా జగత్తుకు గురువు జగదీశ్వరుడే. కేవలం హిందూ ధర్మంలోనే ఈశ్వరుడికి జగద్గురువు స్థానం లభించింది. ‘ఈశావస్యమిదం సర్వం’ అంటాం. అయితే భాగవతం జగద్గురువును సాక్షాత్కరింపచేసింది. అందుకే ‘కృష్ణంవందే జగద్గురుమ్’ అంటాం. శ్రీకృష్ణుడికి తెలియని శాస్త్రం లేదు. 5000 సంవత్సరాల క్రితం అర్జునునికి చేసిన గీతోపదేశంలో వ్యక్తిత్వ వికాసంతో పాటు, నాయకత్వ లక్షణానికి సంబంధించిన ప్రబోధముంది. పనిమంతులను, నీతిమంతులను తయారు చేసేందుకు ఆయన మాటలెంతో ఉపకరిస్తాయి. సాందీపని ఆశ్రమంలో ఆయన ఒక చక్కటి శిష్యుడనిపించుకున్నాడు. 64 రోజుల్లో 64 కళలను అభ్యసించాడు. అకాల మరణం పొందిన సాందీపని మహర్షి కొడుకుని యముణ్ణి గెలిచి సాధించుకొచ్చి గురుదక్షిణగా సమర్పించాడు.
గీత ఒక వ్యక్తి నిర్మాణ యజ్ఞం. మైత్రేయ మహర్షి శ్రీకృష్ణునిచే కలియుగాంతం వరకు జగద్గురువుగ నియమింపబడిన సిద్ధపురుషుడు. మైత్రేయుని గురువు పరాశర మహర్షి. మైత్రేయ పరాశరసంవాదమే విష్ణుపురాణం. విష్ణుపురాణం అధ్యయనం 50 సంవత్సరాలు సాగింది. పరాశరుని కుమారుడై వ్యాసుడు దీన్ని 18 పురాణాలుగా విశదీకరించాడు. శ్రీకృష్ణుని ప్రణాళికననుసరించి కలియుగంలో జీవులనుద్ధరించడానికి వేదవ్యాసుడు భగవద్గీతను దూరం నుండి విని భారతంలో నిక్షిప్తం చేశాడు. సత్యవతి,పరాశరుల కుమారుడు వ్యాసుడు. శ్రీ కృష్ణ ప్రేరితుడై భారత భాగవతాది గ్రంథాలు వ్రాశాడు.
వ్యాసుడు ద్వాపరయుగంలో జరిగిన సంఘటనలన్నీ ప్రత్యక్షంగా చూశాడు. వ్యాసుడి శిష్యులు వైశంపాయనుడు, పైలుడు, జైమిని, సుమంతుడు, నాలుగు దిశలలో వేదాలను ప్రజలకు అందించారు. మహాభారత యుద్ధం తరువాత జరిగిన నష్టం చూసి చలించినపోయిన వ్యాసుడికి ఉపశమనం కలిగేలా నారదుడు భక్తిభావన, భగవదారాధన ప్రాధామ్యంగా జనజీవన శైలి మారేలా భాగవత రచన చేయమని ప్రోత్సహిస్తాడు. భాగవతమే శ్రీకృష్ణలీలామృతం. తరువాత వ్యాసుడి కుమారుడు శుకముని, అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తుకు సత్‌కథాకాలక్షేపంగా వారం రోజులపాటు భాగవతం వినిపిస్తాడు. శుకముని భాగవతం చెబుతుంటే వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి కొడుకు పరాశరుడు, పరాశరుడి కొడుకు వ్యాసుడు ఇంకా అనేక మంది ఋషులతో పాటు ఉగ్ర శ్రవనుడు కూడా విన్నాడు. ఇతన్ని సూతమహర్షి అంటారు. తరువాత కొంత కాలానికి నైమిశారణ్యంలో జరిగిన యజ్ఞానికి శౌనకాది మహా మునులంతా వచ్చారు. అక్కడ సూతుడు భాగవత కథను వినిపించాడు.
భాగవతం ఒక సామాజిక సాంస్కృతిక శాస్త్రం. స్వాయంభువ మనువు నుండి కలియుగం వరకు ఒక క్రమ పద్ధతిలో కథనం ఉంటుంది. వేదాంతంలోని జ్ఞానం, యజ్ఞ యాగాదుల విశేషం, కపిలముని జ్ఞానమార్గం, భక్తి భావం కల్గిన ప్రహ్లాదుడు, గజేంద్రమోక్షంలోని శరణాగతి, భక్తధృవుడి కథ, ఇంకా ఎన్నో ఇందులో ఉంటాయి. ఈ భారత భుమిపై నాడు విలసిల్లిన పృధుచక్రవర్తి, వేనుని అగ్నేంథ్రుడి కథ ఇందులో ఉంటాయి. భాగవతం మనిషలో భక్తిని కల్గిస్తుంది. భగవంతునిలో మానసిక సంబంధం ఏర్పరుస్తుంది. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించే వ్యక్తిత్వ వికాసం భాగవతం కల్గిస్తుంది. ‘సర్వం కృష్ణమయం జగత్’ అనే భావన కల్గిస్తుంది. శివుడే దాత, శివుడే భోక్త, ‘శివుడే తానై శివునికొలుచునటు’ అన్న భావం కల్గిస్తుంది. ఇదే మన హిందూ కుటుంబాలలో కోరుకోవాల్సిన మార్పు.